దేశంలో నేరాల స్థితి గతులు మారుతున్నాయా? ఒకప్పుడు నిరక్షరాస్యులు, కొద్దిమాత్రంగా చదువుకున్న వారే నేరాలకు పాల్పడేవారా? కానీ.. ఇప్పుడు ఉన్నతస్థాయి చదువులు చదివిన వారు.. సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నవారే తప్పులు చేస్తూ.. కటకటాలు లెక్కించే పరిస్థితి వచ్చిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది.
గతంలో పెద్దగా చదువులు లేని వారు దొంగతనాలకు పాల్పడేవారు. కానీ, దేశంలో ఇప్పుడు సైబర్ దొంగలు 20 శాతం వరకు పెరిగారని జాతీయ నేరగణాంక విభాగం(ఎన్‌సీఆర్) పేర్కొంది. గత 2023-24, 2024-25 సంవత్సరాల రిపోర్టులతో పోలిస్తే.. సైబర్ నేరాల్లో తలపెడుతున్నవారు.. సహకరిస్తున్నవారు.. ప్రజలను కొల్లగొడుతున్నవారు అత్యధికులు ఉన్నతస్థాయి విద్యావంతులేనని తేలింది. ఇది పెను సవాల్‌గా మారిందని అంటున్నారు.
కేవలం దొంగతనాలే కాదు.. ఇతర నేరాల విషయానికి వస్తే.. కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఎన్‌సీఆర్ స్పష్టం చేయడం గమనార్హం. హత్యలు, పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత జరుగుతున్న ఆత్మహత్యలు.. హత్యలు వంటివాటిలో కూడా ఉన్నత విద్యావంతుల పాత్ర ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అలానే.. ఆన్‌లైన్ మోసాలకు కూడా.. ఉన్నత విద్యావంతులే కారణంగా కనిపిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇటీవల ముంబై సహా.. దేశవ్యాప్తంగా జరిగిన భారీ మోసాల వెనుక ఎంటెక్, ఐఐటీల్లో చదివిన వారి పాత్ర ఉండడాన్ని నివేదిక స్పష్టం చేసింది.
ఇక, ఈ పరంపరలో యువతుల పాత్రను విస్మరించలేమనడం కూడా నివేదిక చెప్పిన వాస్తవం. పెళ్లిళ్లకు ముందే వేరే వారితో సహజీవనం చేస్తున్న యువతుల సంఖ్య 2024తోపోల్చుకుంటే.. 2025లో 35 శాతం పెరిగిందని.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లికాకుండానే సహజీవనం లేదా.. రిలేషన్‌షిప్‌లో ఉన్న వారి సంఖ్య 90 లక్షలకుపైగానే ఉందని పేర్కొంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, జైపూర్, తిరువనంతపురం వంటి కీలక రాజధానుల్లో ఈ తరహా పరిస్థితి ఎక్కువగా ఉందని తెలిపింది.
చదువులేనివారు ఒకప్పుడు నేరాలకు పాల్పడితే.. ఇప్పుడు చదువుకున్నవారే ఆ బాట పట్టడంతో విద్యావ్యవస్థలోనే మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అదేసమయంలో కీలకమైన న్యాయవ్యవస్థ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా ఉందని పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates