గంట వాన పడితే ఇదీ హైదరాబాద్ పరిస్తితి

వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మంగళవారం భారీ వర్షం కురిసింది. గంటల తరబడి నగరంలోని పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా వర్షం కురవడంతో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వర్షం కురిసిన ప్రాంతాల్లో రాత్రి పొద్దుపోయేదాకా కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జాంలు కొనసాగాయి.

మంగళవారం సాయంత్రం సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా వర్షం కురిసిన నేపథ్యంలో సరాసరి 10 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పాతబస్తీ, రాయదుర్గం ఉన్న నగర పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా రాయదుర్గం, మాదాపూర్ లలో కిలోమీటర్ల కొలది ట్రాఫిక్ స్తంబించిపోయింది.

ఇదిలా ఉంటే… పాతబస్తీలో కురిసిన వర్షం ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను బలిగొంది. భారీ వర్షం నేపథ్యంలో పాతబస్తీలోని ఓ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తెగి కింద పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోకపోవడంతో నీళ్లలోకి విద్యుత్ ప్రసారం అయ్యింది.

అదే సమయంలో ఆటో నుంచి దిగిపోయిన ఇద్దరు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇక పాతబస్తీలోనే భారీ వర్షం కారణంగా ఓ భారీ కమాన్ కూలిపోయింది. మొత్తంగా తొలకరి చినుకులే హైదరాబాద్ ను వణించాయని చెప్పాలి.