ఈ దశాబ్దానికి కోహ్లీనే కింగ్

ఏటా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇచ్చే అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు క్రికెటర్లు. గత దశాబ్ద కాలంలో చాలా ఏళ్లు ఐసీసీ అవార్డుల్లో భారత సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీదే హవా. ఇప్పుడు ఐసీసీ ప్రకటించిన దశాబ్దపు అవార్డుల్లోనూ అతను తన ఆధిపత్యాన్ని చాటాడు. పురుషల క్రికెట్లో ఈ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీనే నిలవడం విశేషం. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్, పాంటింగ్, సంగక్కర, జయవర్దనే, కలిస్, మైకేల్ క్లార్క్ లాంటి నిన్నటి తరం మేటి ఆటగాళ్లు ఈ దశాబ్దంలోనే వేర్వేరు సంవత్సరాల్లో క్రికెట్ నుంచి నిష్క్రమించారు.

ఐతే వీళ్లెవ్వరూ ఈ దశాబ్దంలో పూర్తి కాలం ఆటలో సాగింది లేదు. వారి తర్వాత కోహ్లితో పాటు డివిలియర్స్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్, బెన్ స్టోక్స్ లాంటి మేటి ఆటగాళ్లు ఈ దశాబ్దంలో తమ ఆధిపత్యాన్ని చాటారు. ఐతే అందరిలోకి కోహ్లి మేటిగా నిలిచాడు. ఏదో ఒక ఫార్మాట్ అని కాకుండా టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ కోహ్లి గొప్ప ప్రదర్శన చేశాడు. కెప్టెన్‌గానూ సత్తా చాటుకున్నాడు. దీంతో మిగతా మేటి ఆటగాళ్లందరినీ వెనక్కి నెట్టి 2011-20 దశాబ్దానికి అతనే ఐసీసీ ఉత్తమ క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో పాటు ఈ దశాబ్దానికి ఉత్తమ వన్డే క్రికెటర్‌గానూ కోహ్లి ఐసీసీ పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. ఈ ఫార్మాట్లో విరాట్ ఘనతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

పరుగుల పరంగా మరే ఆటగాడూ అతడికి సమీపంలో లేడు. బౌలర్లెవరూ కూడా అతడి స్థాయి ప్రదర్శన చేయలేదు. దీంతో అతనే ఉత్తమ వన్డే ఆటగాడిగా నిలిచాడు. ఇక భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా ఐసీసీ పురస్కారాల్లో ఒక ప్రత్యేక అవార్డును అందుకున్నాడు. అతడికి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ పురస్కారం లభించింది. 2011 నాటింగ్ హామ్ టెస్టు సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ బెల్‌ ఔటై వెనుదిరిగాక వెనక్కి పిలవడం ద్వారా ధోని గొప్ప క్రీడా స్ఫూర్తిని కనబరిచాడని ఐసీసీ భావించింది.

ఇక ముందు రోజు ప్రకటించిన టీమ్ పురస్కారాల్లో కోహ్లి దశాబ్దపు టెస్టు కెప్టెన్‌గా ఎంపిక కాగా.. ధోని వన్డే, టీ20 జట్లకు కెప్టెన్‌గా గౌరవం సంపాదించుకున్నాడు. కోహ్లికి ఐసీసీ దశాబ్దపు టెస్టు, వన్డే, టీ20 జట్లు మూడింట్లోనూ చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు అతనే. ఐసీసీ దశాబ్దపు పురస్కారాల్లో కోహ్లి సాధించినన్ని అవార్డులు ఇంకెవరూ అందుకోలేదు.