అనంతపురం హనీట్రాప్ గుట్టు వీడింది

సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే ఈ కన్నింగ్ క్రైం వెనుక ఉన్న వారెవరన్న విషయాన్ని పోలీసులు తేల్చేశారు. అంతేకాదు.. హనీ ట్రాప్ ఎపిసోడ్ లో సూత్రధారులు ఎవరు? పాత్రధారులు  ఎవరు? అన్న విషయాన్ని తేల్చేశారు.

ఈ ఉదంతం వెనుక వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. హనీ ట్రాప్ గ్యాంగ్ లోని ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్న నరేందర్ రెడ్డి.. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల వివరాలు.. వారి బలహీనతలు..వారిని ఎలా వలలో చిక్కేలా చేయాలో ప్లాన్ చేస్తుంటారు.

ఎవరిని టార్గెట్ చేయాలో డిసైడ్ అయ్యాక ఈ ముఠా ఎగ్జిక్యూట్ చేస్తుంది. కొంతకాలంగా ఎంతోమంది అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకు ఖాతాల్ని పరిశీలించారు. ముఠా నుంచి డబ్బుల్ని నరేందర్ రెడ్డి తీసుకున్నట్లుగా తేల్చారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి అనంతపురం ఎమ్మెల్యేకు అనంత వెంకట్రామిరెడ్డి అనుచరుడిగా నరేందర్ రెడ్డి చలామణి అయ్యారు.

ఇతగాడు పలు భూవివాదాల్లో తలదూర్చి భారీగా వసూళ్లకు పాల్పడేవాడన్న విషయాన్ని గుర్తించారు. అయితే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇతడి భూపంచాయితీలకు చెక్ పడటంతో.. కొందరు మహిళలతో కలిసి హనీట్రాప్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే లక్షలాది రూపాయిల్ని వసూలు చేసినట్లుగా చెబుతున్నారు

హనీ ట్రాప్ లో కీలకంగా వ్యవహరించిన చిన్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమెపై తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయాన్ని గుర్తించారు. ఈ మధ్యన అనంతపురానికి చెందిన టీడీపీ నేత రాజేష్ నాయుడితో కలిసి అమాయకులను వివిధ పనుల నిమిత్తం ఇంటికి పిలిపించుకోవటం.. ప్లాన్ గా ముగ్గులోకి దింపేది. సన్నిహితంగా ఉన్నప్పుడు రాజేశ్ ఫోటోల్ని తీసుకొని డబ్బుల డిమాండ్చేసేది. ఈ క్రమంలో ఈ వ్యవహారం ముదిరి.. పోలీసులకు చేరటంతో.. మొత్తం గుట్టు రట్టైంది.