బుమ్రానే కొట్టాడంటే.. బీసీసీఐ పేరు రాసుకోవాల్సిందే!

భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. ఇన్నాళ్లూ అతను ఆడుతున్న తీరు చూసి అది కేవలం ‘లక్’ అని, గుడ్డిగా బ్యాట్ ఊపేస్తున్నాడని విమర్శించిన వారి నోళ్లకు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో తాళం పడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మొదటి బంతికే వైభవ్ సిక్సర్ బాదిన తీరు చూస్తుంటే.. ఇతను మామూలు ఆటగాడు కాదు, ఒక అద్భుతం అనిపిస్తోంది. హేమాహేమీ బ్యాటర్లే బుమ్రా బౌలింగ్‌లో మొదటి బంతిని డిఫెన్స్ చేయాలని ఆలోచిస్తారు, కానీ వైభవ్ మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయేలా స్టాండ్స్‌లోకి పంపి తన తెగువ ఏంటో చూపించాడు.

గత సీజన్‌లో కేవలం 14 ఏళ్ల వయసులో గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ బాదినప్పుడే వైభవ్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. రషీద్ ఖాన్, సిరాజ్, ప్రసీద్ కృష్ణ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం లెక్కచేయకుండా బాదేశాడు. అయినా సరే, విమర్శకులు మాత్రం ఇది కొన్నాళ్ల ముచ్చటే అని పెదవి విరిచారు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో 175 పరుగులు చేసినా.. టీనేజ్ బౌలర్లే కదా అని సరిపెట్టారు. ఇక అతని వయసు మీద వచ్చిన ఆరోపణల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు బుమ్రా బౌలింగ్‌లో అతను కొట్టిన ఆ సిక్సర్ మాత్రం వైభవ్ అసలైన క్లాస్‌ను, కాన్ఫిడెన్స్‌ను చాటిచెప్పింది.

ఈ సీజన్‌లో వైభవ్ ఆడుతున్న తీరు అమోఘం. మొదటి మ్యాచ్‌లో చెన్నైపై కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదాడు. రెండో మ్యాచ్‌లో జీటీపై 18 బంతుల్లో 31 పరుగులు చేయగా, ఇప్పుడు ముంబైతో జరిగిన మూడో మ్యాచ్‌లో 14 బంతుల్లోనే 39 పరుగులు (1 ఫోర్, 5 సిక్సర్లు) చేసి విధ్వంసం సృష్టించాడు. అతని బ్యాటింగ్‌లో ఒక ప్రత్యేకత ఉంది.. వైభవ్ ఎప్పుడూ స్లిప్ క్యాచ్‌లు ఇచ్చే రకం కాదు. అతను అవుట్ అవుతున్నాడంటే అది కేవలం సిక్సర్లు కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్ దగ్గరే. అది అతని అటాకింగ్ మైండ్‌సెట్‌కు నిదర్శనం.

ఇక బీసీసీఐ సెలెక్టర్లు కూడా వైభవ్ పేరును సీరియస్‌గా పరిగణించాల్సిన సమయం వచ్చేసింది. వయసులో చిన్నవాడని, ఇప్పుడే మెయిన్ స్క్వాడ్‌లోకి వద్దని అనడం ఇక కుదరదు. 15 ఏళ్లు దాటిన వైభవ్, ఐపీఎల్ లాంటి పెద్ద స్టేజీపై దిగ్గజ బౌలర్లను ఎదుర్కొంటున్న తీరు చూస్తుంటే, అతనికి టీమిండియా స్క్వాడ్‌లో చోటు కల్పించడం న్యాయబద్ధంగా అనిపిస్తోంది. ఇలాంటి ‘డేర్ డెవిల్’ బ్యాటర్లు జట్టులో ఉంటే పవర్ ప్లేలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు. అతని ఆటతీరు చూస్తుంటే కళ్ళు మూసుకుని స్క్వాడ్‌లోకి తీసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విమర్శకుల మాటలను తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్న ఈ బీహార్ కుర్రాడు, రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.