బంధువులను రైలు ఎక్కించడానికి వెళ్లినవాళ్లు అనుకోకుండా అదే రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. పైగా టికెట్లు లేకపోవడంతో ఏకంగా రూ.36,140 చెల్లించాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో బంధువుల లగేజీ సర్దేందుకు వెళ్లిన 12 మంది పెద్దలు, ఒక చిన్నారి అందులోనే చిక్కుకుపోయారు. ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోవడంతో రైలు దిగేందుకు అవకాశం లేకుండా పోయింది.
నవంబర్ 15న బనారస్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.26 గంటలకు కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ కొందరు ప్రయాణికులను ఎక్కించేందుకు వారి బంధువులు రైలు లోపలికి వెళ్లారు. లగేజీ పెట్టి, సీట్లలో కూర్చోబెట్టి తిరిగి దిగాలనుకున్నారు. కానీ ఉదయం 9.30 గంటలకు రైలు బయలుదేరే సమయానికి తలుపులు మూసుకుపోయాయి. వాటిని తెరవడం సాధ్యం కాకపోవడంతో అందరూ రైలులోనే ఉండిపోయారు.
రైలు కదిలిన తర్వాత తమను దించేయాలని సిబ్బందిని కోరారు. అయితే మధ్యలో రైలును నిలపలేమని చెప్పడంతో కొందరు ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది తుండ్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి అధికారుల ఆదేశాలతో కాన్పూర్ నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని ఇటావా జంక్షన్‌లో రైలును ప్రత్యేకంగా ఆపారు. ఉదయం 10.49 గంటలకు అక్కడికి చేరుకున్న తర్వాత అందరినీ దించారు. అప్పటికే దాదాపు 79 నిమిషాల ప్రయాణం పూర్తయింది.
అయితే ఇటావాలో దిగిన తర్వాత కూడా వారికి ఇబ్బందులు తప్పలేదు. టికెట్లు లేకుండా ప్రయాణించినందుకు రైల్వే అధికారులు టికెట్ ఛార్జీలు, జరిమానా కలిపి మొత్తం రూ.36,140 వసూలు చేశారు. వందే భారత్ రైళ్లలో బయలుదేరే ముందు తలుపులు మూసుకుంటాయని ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ప్రయాణికులు కానివారు తప్పనిసరిగా దిగిపోవాలని అధికారులు తెలిపారు. ప్లాట్‌ఫామ్ టికెట్ ఉన్నా రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates