ఎమ్మెల్యేలకు ఫ్రీ ఐపీఎల్ టిక్కెట్లు… అసెంబ్లీలో రచ్చ

​ఐపీఎల్ సందడి మొదలైందంటే చాలు టికెట్ల కోసం సామాన్యులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అదే వరుసలో నిలబడ్డారు. తమకు ఐపీఎల్ మ్యాచుల కోసం కనీసం నాలుగు ప్రీమియం టికెట్లు, విఐపి సౌకర్యాలు కల్పించాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు.

పార్టీల ప్రమేయం లేకుండా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ ఈ విషయంలో ఏకతాటిపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఎమ్మెల్యేకు నాలుగు టికెట్లు కేటాయించేలా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తో చర్చించాలని స్పీకర్ యు.టి. ఖాదర్ స్వయంగా డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌ను ఆదేశించారు.

​బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిపై ఈ చర్చ మొదలైంది. సుమారు 16 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం నెలకు 1,600 రూపాయలకే క్రికెట్ అసోసియేషన్ వాడుకుంటోందని, కానీ వారు మాత్రం ఒక్కో టికెట్‌ను 2,000 నుండి 20,000 రూపాయల వరకు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారని ప్రతిపక్ష నేత ఆర్. అశోక విమర్శించారు. శిక్షణ కోసం ఇచ్చిన భూమిని కమర్షియల్ గా వాడుకుంటున్నారని, తీరా ఎమ్మెల్యేలు టికెట్లు అడిగితే గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

​ఎమ్మెల్యేలకు కేవలం ఒకటే టికెట్ ఇస్తున్నారని, అది కూడా సరైన సీటింగ్ లేని చోట కేటాయిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు స్టేడియంలో ప్రత్యేకంగా విఐపి లాంజ్ ఉండాలని, గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రికెట్ అసోసియేషన్ కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుందని, ప్రభుత్వ అనుమతులపై ఆధారపడే వారు ఎమ్మెల్యేల రిక్వెస్ట్‌లను పట్టించుకోవడం లేదని సభలో చర్చ జరిగింది.

​మరోవైపు బెంగళూరులో ప్రస్తుతం ఉన్న స్టేడియం సామర్థ్యం సరిపోవడం లేదని, లక్ష మంది కూర్చునేలా కొత్త స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి కె.జె. జార్జ్ తెలిపారు. దీనికోసం జక్కూరు ఫ్లయింగ్ స్కూల్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే విమానాశ్రయం వెళ్లే దారిలో స్టేడియం కడితే ట్రాఫిక్ సమస్యలు వస్తాయని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదేమైనా కొత్త స్టేడియం సంగతి పక్కన పెడితే, ప్రస్తుత ఐపీఎల్ మ్యాచుల టికెట్ల కోటాపైనే ఎమ్మెల్యేలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

​సాధారణంగా పన్నులు చెల్లించే సామాన్యుడు వేల రూపాయలు పెట్టి టికెట్లు కొంటుంటే, కోట్లాది రూపాయల ఆస్తులున్న ప్రజాప్రతినిధులు ఇలా ఉచిత టికెట్ల కోసం పట్టుబట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ భూమిని వాడుకుంటున్నందుకు క్రికెట్ అసోసియేషన్ కొంత బాధ్యతగా ఉండాలని ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. డిప్యూటీ సీఎం చర్చల తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఎంతమంది ఎమ్మెల్యేలకు ఈ విఐపి టికెట్లు కేటాయిస్తుందో వేచి చూడాలి.