పెట్రోల్ రేట్లు పెరగవు.. అలా అని తగ్గవు కూడా!

అంతర్జాతీయంగా యుద్ధం జరుగుతున్న వేళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పెరుగుతాయని అందరూ భయపడుతుంటే, కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంధనంపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయల మేర తగ్గిస్తూ ఊరటనిచ్చింది. అయితే, ఈ పన్ను తగ్గింపు వల్ల రేపటి నుండి పెట్రోల్ బంకుల్లో ధరలు భారీగా తగ్గిపోతాయని అనుకుంటే పొరపాటే. నిజానికి, ఈ నిర్ణయం వినియోగదారుడి జేబుకు తక్షణ లాభం కంటే, దేశీయ ఆయిల్ రిఫైనరీల పై పడే విపరీతమైన భారాన్ని తగ్గించడానికే అని చెప్పాలి.

పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు చుక్కలను చూస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మూతపడటంతో రవాణా ఖర్చులు కూడా రెట్టింపు అయ్యాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఆయిల్ రిఫైనరీలు భారీ నష్టాల్లోకి వెళ్తాయి. ఆ నష్టాలను భర్తీ చేయడానికి కంపెనీలు లీటరుకు 20 నుండి 30 రూపాయల వరకు ధర పెంచాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వం రంగంలోకి దిగింది.

పన్నును 10 రూపాయలు తగ్గించడం ద్వారా, రిఫైనరీలకు ఆ మేర ఉపశమనం కలిగించింది. అంటే, అంతర్జాతీయంగా ధర పెరిగినా, ఆ భారం మన బంకుల్లో కనిపించకుండా ఈ పన్ను తగ్గింపు ఒక ‘షీల్డ్’ లాగా పనిచేస్తుంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు సగానికి పైగా హార్ముజ్ మార్గం ద్వారానే పొందుతుంది. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఈ మార్గం దెబ్బతినడంతో సరఫరా గొలుసులో గందరగోళం ఏర్పడింది. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు ఈ పన్ను తగ్గించకపోయి ఉంటే, పెట్రోల్ ధర లీటరుకు 120 రూపాయలు దాటిపోయే ప్రమాదం ఉండేది.

ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ధరలు పెరగకుండా స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అంటే, ఇది ధరలను తగ్గించే పథకం కాదు, పెరగకుండా అడ్డుకునే ఒక రక్షణ కవచం లాంటిది. వంట గ్యాస్ విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.

33 కోట్ల కుటుంబాలకు అవసరమైన ఎల్పీజీ దిగుమతులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగా నిల్వలను పెంచుతోంది. దేశంలో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా చమురు, 30 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. యుద్ధం సుదీర్ఘంగా సాగినా మనకు ఇబ్బంది కలగకుండా, రిఫైనరీల ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ప్రభుత్వం పన్నుల సర్దుబాటు చేస్తోంది. దీనివల్ల కంపెనీలు నష్టపోకుండా తక్కువ ధరకే సామాన్యుడికి ఇంధనాన్ని అందించగలుగుతాయి.