స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక మొబైల్‌లో ఏకంగా 10,001 mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ బరువు కేవలం 219 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం.
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.78 ఇంచుల 4D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని ప్రత్యేకత. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేసే ఈ మొబైల్‌లో 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది లేటెస్ట్ రియల్‌మీ UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
చార్జింగ్ పరంగా కూడా రియల్‌మీ తగ్గేదేలే అంటోంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది, అంటే మీ ఫోన్ ద్వారా ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి IP69, IP68 రేటింగ్స్ ఇచ్చారు. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను వాడారు.
ధరల వివరాల్లోకి వెళ్తే..
8GB/128GB వేరియంట్ రూ. 25,999
8GB/256GB వేరియంట్ రూ. 27,999
12GB/256GB వేరియంట్ రూ. 30,999
ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ బ్లూ రంగుల్లో లభించే ఈ ఫోన్ అమ్మకాలు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్‌తో పాటు రియల్‌మీ మరిన్ని గ్యాడ్జెట్లను కూడా లాంచ్ చేసింది. జెమిని పవర్డ్ వాయిస్ అసిస్టెంట్ ఉన్న బడ్స్ క్లిప్ ఇయర్‌బడ్స్‌ను రూ. 5,999 కి, అలాగే 20,000 mAh పవర్‌బ్యాంక్‌ను రూ. 2,799 కి ప్రవేశపెట్టింది. బ్యాటరీ బ్యాకప్ ముఖ్యం అనుకునే వారికి ఈ ఫోన్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates