అమెరికాలో ఆకలీ కేకలా?

ప్రపంచానికి అగ్రగామిగా చెప్పుకునే అమెరికాలో ప్రస్తుతం ఆకలి సంక్షోభం తలెత్తింది. దీనికి కారణం మరేదో కాదు, అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వంలో నెలకొన్న ‘షట్‌డౌన్’. బడ్జెట్‌పై కాంగ్రెస్, శ్వేతసౌధం మధ్య నెలకొన్న పేచీ కారణంగా, పేద ప్రజలకు అందే అత్యవసర సంక్షేమ పథకాల నిధులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో, దాదాపు 4.2 కోట్ల మంది అమెరికన్లు తమ ఆహారం కోసం ఉచిత కేంద్రాల ముందు తెల్లవారుజామునే క్యూలు కట్టాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.

ఈ సంక్షోభం వెనుక రాజకీయాలు ప్రధానంగా ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన బడ్జెట్‌లోని కీలక అంశాలను మార్చాలని సెనేట్ (ఎగువ సభ) గట్టిగా డిమాండ్ చేస్తోంది. దానికి అధికార రిపబ్లికన్ పార్టీ అంగీకరించకపోవడంతో, సెనేట్ ఆమోదం దక్కలేదు. ఈ రాజకీయ గొడవ ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఆగిపోయాయి. చట్ట సభల్లో నెలకొన్న ఈ మొండి వైఖరి, దేశ ఆర్థిక మూలాలనే దెబ్బ తీస్తోంది.

పేదలకు జీవనాధారంగా ఉన్న ‘SNAP’ (సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్) నిధులు నిలిచిపోవడంతో పరిస్థితి విషమించింది. ఈ స్కీమ్ ద్వారా సాధారణంగా ఒక్కో పేద కుటుంబానికి నెలకు 200 డాలర్ల నుంచి 900 డాలర్ల వరకు సాయం అందేది. ఇప్పుడు ఈ సాయం ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో, వారంతా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ఫుడ్ ప్యాంట్రీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఆ సెంటర్లు కూడా త్వరగా ఖాళీ అవుతుండటంతో, రాత్రి నుంచే క్యూలో నిల్చోవడం మొదలైంది.

ఈ షట్‌డౌన్ కేవలం పేద ప్రజలను మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. ఈ రాజకీయ ప్రతిష్టంభన కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ. 62 వేల కోట్ల (సుమారు 7 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లిందని అధికారిక బడ్జెట్ కార్యాలయం ప్రకటించింది.

నిజానికి, ప్రభుత్వం వద్ద నిధులు లేవని వాదించడం సరికాదని కోర్టులు ట్రంప్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించాయి. మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్ ఫెడరల్ జడ్జిలు జోక్యం చేసుకుని, నవంబర్ 5వ తేదీ నాటికి ఎలాగైనా SNAP నిధులు కొంత మొత్తమైనా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇతర మార్గాల ద్వారా డబ్బు సేకరించైనా సరే, పేదలకు సాయం ఆపకూడదని కోర్టులు స్పష్టం చేశాయి.