బెంగళూరులో ఒలా ఎలక్ట్రిక్‌లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) అనే ఇంజనీర్ ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అరవింద్ చనిపోయే ముందు రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, ఒలా ఫౌండర్ భావిష్ అగర్వాల్‌తో సహా తన ఉన్నతాధికారులు తనను మానసికంగా హింసించారని, డబ్బు విషయంలో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో, కంపెనీలో హరాస్‌మెంట్ వల్లే తన సోదరుడు చనిపోయాడని అరవింద్ సోదరుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు అగర్వాల్‌తో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు.
2022 నుంచి హోమోలోగేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అరవింద్, సెప్టెంబర్ 28న బెంగళూరులోని తన ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అతనిని ఆసుపత్రికి తరలించినా, అదే రోజు చనిపోయారు. ఆ తర్వాత అతని సోదరుడికి 28 పేజీల సూసైడ్ నోట్ దొరికింది. అందులో అరవింద్ తన మేనేజర్లు సుబ్రత్ కుమార్ దాస్, భావిష్ అగర్వాల్ పేర్లను ప్రస్తావిస్తూ, జీతాలు, అలవెన్స్‌లు ఇవ్వకుండా మానసికంగా చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు.
అరవింద్ చనిపోయిన రెండు రోజుల తర్వాత, అతని అకౌంట్‌లోకి రూ.17.46 లక్షలు అనుమానాస్పదంగా ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. దీని గురించి అరవింద్ సోదరుడు ఒలాను అడగ్గా, అధికారి దాస్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. తర్వాత కంపెనీ నుంచి వచ్చిన ముగ్గురు ప్రతినిధులు కూడా ఈ లావాదేవీపై స్పష్టత ఇవ్వకపోవడంతో, కంపెనీ ఉద్దేశాలపై తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
అరవింద్ సోదరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అక్టోబర్ 6న భావిష్ అగర్వాల్, దాస్ ఇతరులపై కేసు ఫైల్ చేశారు. తమ ఉన్నతాధికారులు నిరంతరం చేసిన వేధింపులు, అవమానాలు, ఆర్థిక దోపిడీ కారణంగానే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నారని ఎఫ్‌ఐఆర్ లో ఉంది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఆఫీసర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఒలా కంపెనీ దీనిపై స్పందిస్తూ, అరవింద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది. తన ఉద్యోగం లేదా వేధింపుల గురించి అరవింద్ ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, కంపెనీ వ్యవస్థాపకుడితో అతనికి ప్రత్యక్ష సంభాషణలు ఉండేవి కావని ఒలా క్లారిటీ ఇచ్చింది. ఒలా కంపెనీ, తమ ఫౌండర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కర్ణాటక హైకోర్టులో సవాలు చేసింది. ప్రస్తుతం ఒలా ఎలక్ట్రిక్ దాని అధికారులకు హైకోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు లభించాయి. అయినప్పటికీ, ఈ కేసులో అరవింద్‌కు న్యాయం జరగాలని, ఇలాంటి కార్పొరేట్ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు సన్నిహితులు ఆరోపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates