గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం కొద్ది నిమిషాల వ్యవధిలోనే కూలిపోవడం వల్ల 270 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోరం అందరినీ కుదిపేసింది. ఈ విషాద ఘటనకు కారణాలను వెలికితీయాలంటే బ్లాక్‌బాక్స్ కీలక ఆధారంగా మారుతుంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ బ్లాక్‌బాక్స్ ప్రమాదంలో దెబ్బతిందని అధికారులు గుర్తించారు. దాంతో, దానిని మరింత లోతుగా విశ్లేషించేందుకు విదేశాలకు పంపే దిశగా ప్రణాళికలు వేస్తున్నారు.
విమాన బ్లాక్‌బాక్స్ అనేది విమానంలో చివరి క్షణాల డేటా, పైలట్ కమ్యూనికేషన్, టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ నమోదయ్యే అత్యంత కీలక పరికరం. కానీ ఈ ప్రమాదంలో అది తక్కువ మొత్తంలోనే సురక్షితంగా ఉండటం విచారణకు అడ్డంకిగా మారుతోంది. అందుకే బ్లాక్‌బాక్స్‌లోని డేటాను డికోడ్ చేయగల అత్యాధునిక సాంకేతికత అవసరం పడుతోంది. అందులో భాగంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌కు పంపే విషయంపై చర్చ సాగుతోంది.
ఇప్పటికే బ్లాక్‌బాక్స్‌ను స్థానిక BJ వైద్య కళాశాల హాస్టల్ పై నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అది పూర్తిగా డ్యామేజ్ అవ్వకపోయినా, లోపలి డేటా పూర్తిగా రికవర్ చేయాలంటే స్పెషలైజ్డ్ అనాలిసిస్ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కలిసి ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాకు పంపే ముందు ప్రోటోకాల్స్ పాటించడం, ఇండియన్ అధికారుల బృందం అక్కడకు వెళ్లడం వంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపాల్సిన ప్రధాన కారణం.. అందులో ఉన్న డేటా తీవ్రంగా దెబ్బతినడంతో, భారత్‌లో ఉన్న ల్యాబ్‌లు ఆ సమాచారాన్ని పూర్తిగా రికవర్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అగ్రరాజ్యమైన అమెరికాలో ఉన్న నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) వంటి సంస్థల వద్ద అత్యాధునిక టెక్నాలజీ, ప్రత్యేక పరిజ్ఞానం ఉండటంతో, బ్లాక్‌బాక్స్ లోపలి డేటాను డీకోడ్ చేయడం అక్కడ సాధ్యమవుతుంది. అంతేకాదు, ప్రమాదానికి గల అసలైన కారణాలను ఖచ్చితంగా గుర్తించేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్లేషణ జరగాలన్నదే ఈ నిర్ణయానికి ప్రధాన బలంగా నిలిచింది.
ఈ నేపథ్యంలో బ్లాక్‌బాక్స్‌లోని సమాచారం ఎన్ని జీవాలను నష్టపోయామనే దుఖాన్ని తగ్గించలేనప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివారించేందుకు మార్గదర్శకంగా నిలవనుంది. తుది నివేదిక వచ్చేవరకు విమాన ప్రమాదానికి గల నిజమైన కారణం తెలియదు కానీ, బ్లాక్‌బాక్స్ నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates