ఐపీఎల్‌లో ‘లోకల్’ ఫీలింగ్‌ను దాటి వివిధ రాష్ట్రాల్లో ఆదరణ సంపాదించుకున్న జట్లు చాలా తక్కువే. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ ముందంజలో ఉంటుంది. ధోనీకి ఉన్న ఆకర్షణ, ఆదరణ వల్ల కావచ్చు, ఆటతీరు బాగుండటం వల్ల కావచ్చు దేశవ్యాప్తంగా ఆ జట్టు ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆట ఎలా ఉన్నప్పటికీ కోహ్లి, డివిలియర్స్ లాంటి ఆటగాళ్ల వల్ల బెంగళూరుకు కూడా బాగానే ఆదరణ ఉంది.
ముంబయికి కూడా బయటి రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉంది కానీ.. ఆ జట్టు మీద అదే స్థాయిలో వ్యతిరేకత కూడా లేకపోలేదు. అందుకు వాళ్ల ఆధిపత్యం, ఫ్రాంఛైజీ అంబానీది కావడం, ఆటగాళ్ల యాటిట్యూడ్ కూడా ఒక కారణం కావచ్చు. ఇక లీగ్‌లో నిలకడైన ప్రదర్శన, ఆటగాళ్ల ఆకట్టుకునే వ్యక్తిత్వం వల్ల ఆదరణ తెచ్చుకున్న మరో జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పాలి. 2013లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆ జట్టు ప్రదర్శన నిలకడగా సాగుతోంది. దీనికి తోడు అందరూ మెచ్చే, అద్భుతంగా ఆడే డేవిడ్ వార్నర్ ఆ జట్టు కెప్టెన్ కావడం దానికి ఆదరణ పెరగడానికి ఒక ముఖ్య కారణం.
2016లో సన్‌రైజర్స్ కప్పు గెలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో ఏకంగా 850 దాకా పరుగులు చేసి జట్టును విజేతగా నిలిపాడు వార్నర్. ఆ సీజన్లో సన్‌రైజర్స్ కప్పు గెలిచిన తీరు కూడా అద్భుతమనే చెప్పాలి. ఆ సీజన్లో లీగ్ దశలో సన్‌రైజర్స్ మూడో స్థానంతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ముందు ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను, ఆ తర్వాత రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ లయన్స్‌ను ఓడించి ఫైనల్ చేరిన సన్‌రైజర్స్.. తుది పోరులో బెంగళూరును ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది.
ఈ సీజన్ సెంటిమెంటు ఇప్పుడు హైదరాబాద్ అభిమానుల్లో ఆశలు రేపుతోంది. అప్పట్లాగే ఇప్పుడూ సన్‌రైజర్స్ లీగ్ దశలో మూడో స్థానమే సాధించింది. ఎలిమినేటర్‌లో బెంగళూరును ఓడించింది. ఊపు కొనసాగిస్తే క్వాలిఫయర్‌లో ఢిల్లీని ఓడించడమూ కష్టం కాకపోవచ్చు. ముంబయితో పోరు సవాలే కానీ.. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ఆ జట్టును చిత్తు చేసిన సంగతి మరువరాదు. ఆ మ్యాచ్‌లో బుమ్రా, బౌల్ట్ లేని మాట వాస్తవమే. కానీ బ్యాటింగ్‌లో ఆ జట్టు బలంగానే ఉన్నా.. గట్టి దెబ్బ తీయడం మరువరాదు. 2016లో లీగ్ దశలో తిరుగులేని ప్రదర్శన చేసిన బెంగళూరుకు ఫైనల్లో సన్‌రైజర్స్ షాకిచ్చిన సంగతీ ప్రస్తావనార్హం. కాబట్టి సెంటిమెంట్ వర్కవుటైతే సన్‌రైజర్స్ రెండో ఐపీఎల్ కప్పును సొంతం చేసుకోవచ్చు.