కుంభమేళాకు వెళ్లి వస్తూ… ఏడుగురు దుర్మరణం

మహా కుంభమేళాకు వెళ్లిన హైదరాబాదీలు ప్రమాదంలో చిక్కుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా… పలువురు గాయపడ్డారు. మృతులతో పాటుగా గాయపడ్డ వారంతా.. హైదరాబాద్ లోని నాచారం పరిధిలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్‌కు చెందినవారుగా గుర్తించారు. వీరంతా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్బంగా ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్ లోని నాచారం పరిధిలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్‌కు చెందిన వారు ఉత్తర ప్రదేశ్ లో జరగుతున్న మహా కుంభమేళాకు బయలుదేరారు. ఇందుకోసం వీరంతా ఓ మినీ బస్సు ను అద్దెకు తీసుకున్నారు. AP29 W1525 నెంబరు కలిగి ఉన్న ఈ బస్సు ద్వారా ప్రయాగ్ రాజ్ చేరుకున్న వీరంతా.. కుంభ మేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం అదే బస్సు లో తిరుగు ప్రయాణం అయ్యారు. వీరి బస్సు మరి కొన్ని గంటల్లో గమ్యస్థానం చేరేదే. అయితే… రాంగ్ రూటులో వచ్చిన ఓ భారీ ట్రక్ వీరి బస్సు ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మినీ బస్సు లో ఉన్న హైదెరాబాదీల్లో ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇక బస్సు లో మిగిలి ఉన్న వారంతా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఆరుగురిని గుర్తించారు. ఆ ఆరుగురు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్‌లుగా గుర్తించినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. మరో మృతుడిని గుర్తించాల్సి ఉంది.