అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ రహస్య సమాచారాన్ని తెలుసుకునే అనుమతిని బైడెన్‌కు రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన, తన అధికారిక హోదాను ఉపయోగించి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గతంలో తాను ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్ కోల్పోయినప్పటి నుంచి ఇదే తరహాలో ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఉన్న సంప్రదాయం ప్రకారం, మాజీ అధ్యక్షులకు జాతీయ భద్రతకు సంబంధించిన కొన్ని రహస్య సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు ట్రంప్ తన అధికారం ఉపయోగించి బైడెన్‌ను ఆ అవకాశం నుంచి పూర్తిగా తప్పించారు.
తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, బైడెన్ మతిమరపు సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశముందన్న కారణంతోనే ఆయనకు భద్రతా అనుమతులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే, దీనిపై బైడెన్ ఇంకా స్పందించలేదు.
ఈ నిర్ణయం వెనుక రాజకీయ కసీదా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై బైడెన్ గెలిచిన తర్వాత, క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన ఘటన అందరికీ తెలిసిందే.
ఆ ఘటన తర్వాత బైడెన్, ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్‌కి సంబంధిత అనుమతులను తొలగించారు. ఇప్పుడదే పద్ధతిలో ట్రంప్ కూడా బైడెన్‌కి గట్టి ఎదురు దెబ్బ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
ట్రంప్ తాజా నిర్ణయం రాజకీయంగా కలకలం రేపుతోంది. అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికలకు ముందు, ట్రంప్, బైడెన్ మధ్య వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. భద్రతా అనుమతుల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అయితే, దేశ భద్రత విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సరైనదనే దానిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇక దీనిపై బైడెన్ ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates