ధోనీని తొందరపడి తిట్టేయకండి

ఒకప్పుడు తమకు ఎంతమాత్రం విజయావకాశాలే లేవనుకున్న ఎన్నో మ్యాచ్‌లను చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేసేది. చివర్లో కథ మొత్తం మారిపోయేది. కానీ ఇప్పుడు కథ రివర్సవుతోంది. చెన్నై చేతిలో ఉన్న మ్యాచ్‌లను ప్రత్యర్థి జట్లు ఎగరేసుకుపోతున్నాయి. ఆ జట్టు కెప్టెన్ ధోని మ్యాజిక్ ఎంతమాత్రం పని చేయట్లేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవమైన దశను చూస్తున్నాడు కెప్టెన్ కూల్. ఈ సీజన్లో ఆ జట్టుకు, ధోనీకి ఎంతమాత్రం కలిసి రావడం లేదు.

గత రెండు సీజన్లలో వయసు మళ్లిన ఆటగాళ్లను పెట్టుకునే జట్టును ఫైనల్ చేర్చాడు. ఒకసారి కప్పు కూడా అందించాడు ధోని. కానీ ఈసారి అదే జట్టు ప్రత్యర్థుల చేతుల్లో షాక్‌ల మీద షాక్‌లు తింటోంది. తాజాగా ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది. దిల్లీ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన చెన్నై.. బౌలర్ల ప్రతిభతో ప్రత్యర్థిని బాగానే కట్టడి చేసింది. కానీ చివరికి మ్యాచ్ మాత్రం ఢిల్లీ సొంతమైంది.

ధోనీతో పాటు దీపక్ చాహర్, అంబటి రాయుడు.. ధావన్ క్యాచ్‌లు తలా ఒకటి వదిలేసి అతణ్ని సెంచరీ చేయనిచ్చారు. లేకుంటే ఢిల్లీ ఓటమి చాలా ముందే ఖరారైపోయేది. అతను ఎంత బాగా ఆడినా సరే.. చివరి ఓవర్ ముందు వరకు చూస్తే చెన్నైనే గెలిచేలా కనిపించింది. ఆఖరి ఓవర్లో 17 పరుగులు చేయాలి. అప్పటికే బాగా అలసిపోయిన ధావన్ ముందు ఓవర్లో షాట్లు ఆడలేక బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో ఢిల్లీకి ఓటమి తప్పదనిపించింది. కానీ చివరి ఓవర్లో ఊహించనిది జరిగింది. అందరూ డ్వేన్ బ్రావో ఆ ఓవర్ వేస్తాడనుకుంటే ధోని జడేజా చేతికి బంతినందించాడు. స్పిన్ బౌలింగ్‌లో పండగ చేసుకున్న అక్షర్ పటేల్ వరుసగా రెండు సిక్సులు కొట్టి లక్ష్యాన్ని తేలికగా మార్చేశాడు. తర్వాత ఇంకో సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఇక అంతే.. నెటిజన్లు ఒక్కసారిగా ధోనీ మీద విరుచుకుపడిపోయారు.

బ్రావో ఉండగా.. జడేజాతో చివరి ఓవర్ వేయిస్తాడా.. అతడికి బుర్ర పని చేస్తోందా.. అంటూ తిట్టిపోశారు. కానీ వాస్తవం ఏంటంటే.. బ్రావో ఫిట్నెస్‌ సమస్యలతో మూడో ఓవర్ వేశాక మైదానాన్ని వదిలి వెళ్లిపోయాడు. పేసర్లందరి ఓవర్లూ అయిపోయాయి. మిగిలింది జడేజా, కర్ణ్ శర్మలే. ఐతే జడేజా అనుభవం, ఇలాంటి సమయాల్లో మ్యాచ్‌లు మలుపు తిప్పిన సందర్భాల్ని గుర్తుంచుకుని అతడికి బంతినిచ్చాడు ధోని. పాపం అతను ఈసారి మ్యాజిక్ చేయలేకపోయాడు. అదీ సంగతి. కాబట్టి తొందరపడి ధోనీని మరీ తిట్టేయకండి.