భూ కేటాయింపుతో బాబు త‌ప్పు చేశారా?

భూ కేటాయింపుతో బాబు త‌ప్పు చేశారా?

అధికారంలో ఉన్న వారికి ఉండే త‌ల‌నొప్పులు అన్నిఇన్ని కావు. ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యానికి స‌వాల‌క్ష ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వం మంచి ఉద్దేశ్యంతో నిర్ణ‌యాలు తీసుకున్నా.. దాన్లో త‌ప్పులు వెతికే వారి సంఖ్య బారీగా ఉంటుంది. అందుకే.. వివాదాస్పం అయ్యే అంశాల‌కు జోలికి వెళ్ల‌కుండా కొంద‌రు ముఖ్య‌మంత్రులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండి.. కిందామీదా ప‌డిన చంద్ర‌బాబు.. ఎట్ట‌కేల‌కు ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో.. ప్ర‌భుత్వాలు భూ పంపిణీ చేప‌డితే త్రీవ‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తేవారు. తాము వేలెత్తి చూపిన తీరులోనే.. త‌మ‌ను కూడా విపక్షాలు విమ‌ర్శించే వీలుంద‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు ఎందుకు మ‌ర్చిపోతున్నారో తెలీని పరిస్థితి?
ప్ర‌ముఖ యోగా గురువు జ‌గ్జీవాసుదేవ్ కు చెందిన ఈషా ఫౌండేష‌న్ కు ఇబ్ర‌హీంప‌ట్నం త్రిలోచ‌నాపురంలో  400 ఎక‌రాలు కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ సంస్థ ఏర్పాటు చేయ‌నున్న ప‌లు కార్య‌క్ర‌మాల‌కు ఈ భూమిని వినియోగించనున్నారు. సీమాంధ్ర‌లో భూమి ఎంత విలువైన‌దో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

అలాంటి స‌మ‌యంలో ఒక సంస్థ‌కు 400 ఎక‌రాలు కేటాయించే పెద్ద విష‌యంలో చంద్ర‌బాబు తొంద‌ర‌ప‌డ్డార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ భూ కేటాయింపు కార‌ణంగా లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టుకున్నార‌న్న మాట వినిపిస్తోంది. 400 ఎక‌రాలంటే కోట్లాది రూపాయిలు విలువ గ్యారెంటీ. అలాంటి విలువైన భూమిని ఏదైనా కంపెనీకి ఇవ్వ‌టం ద్వారా భారీ ఎత్తున ఉపాధి ల‌బిస్తున్నా.. వేలాది కోట్ల‌రూపాయిలు పెట్టుబ‌డులు వ‌చ్చినా బాగుంటుంది. అదేమీ లేని ప‌రిస్థితుల్లో ఇంత భారీ ఎత్తున భూమి ఇవ్వ‌టం రాజ‌కీయంగా దెబ్బ తీస్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే ఇప్ప‌టికే.. ఈ అంశాన్ని విప‌క్షాలు విమ‌ర్శించ‌టం మొద‌లుపెట్టాయి. ఈ భూకేటాయింపున‌కు ముందు.. జ‌గ్జీవాసుదేవ్ నేతృత్వంలో మూడు రోజుల పాటు ప్ర‌త్యేక యోగా త‌ర‌గతులు నిర్వ‌హించ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా.. అయిన ఖ‌ర్చు మీద‌నే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా భూకేటాయింపుల కార‌ణంగా మ‌రిన్ని స‌మ‌స్య‌ల్ని బాబు స‌ర్కారు తెచ్చి పెట్టుకుంద‌ని చెబుతున్నారు.ఈ నిర్ణ‌యంపై బాబు స‌ర్కారు పున‌రాలోచించ‌టం మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. బాబు త‌ప్పును స‌రిదిద్దుకుంటారా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు