సీఆర్‌కు హితవు చెప్పిన చిరు

సీఆర్‌కు హితవు చెప్పిన చిరు

మొత్తానికి తన కులానికి, తన గ్రూపునకు చెందిన మంత్రి సి.రామచంద్రయ్యపై , ముఖ్యమంత్రి కిరణ్‌ వేటు వేసేయకుండా చిరంజీవి చక్రం అడ్డు వేయగలిగారు. సీఆర్‌పై చర్య తీసుకునే ఉద్దేశం అధిష్ఠానం మదిలో ఏదీ లేదని.. ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానంలోని పలువురు పెద్దలతోను, పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోను కూడా విడివిడిగా సమావేశం అయిన.. చిరంజీవి.. మూడు రోజుల మంతనాల తర్వాత.. చివరికి సీఆర్‌పై వేలాడుతున్న వేటుకత్తిని ఉపసంహరింపజేయగలిగారు. ఇదంతా ఒక ఎత్తు.. బహిరంగంగా ఆయన కూడా అందరికీ చెప్పుకోదగినది.

అయితే లోలోపల.. చోటు చేసుకున్న మరో వ్యవహారం కూడా ఉంది. చిరంజీవి సి.రామచంద్రయ్యపై వేటు పడకుండా చూడాలని మేడం సోనియాను, ఇతర పెద్దలను సంప్రదించినప్పుడు.. వారు రామచంద్రయ్య పెడపోకడల గురించి కూడా ఆయనతో ప్రస్తావించినట్లు సమాచారం. చీటికీ మాటికీ కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవే నంటూ ఇప్పటినుంచి పార్టీలో చీలికలు తీయడానికి, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లడానికి రామచంద్రయ్య కారకుడు అవుతున్నాడని, ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఉపేక్షించాలని కాంగ్రెస్‌ పెద్దలు చిరంజీవిని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి జవాబు లేక చిరు నీళ్లు నమలాల్సి వచ్చింది. కిరణ్‌ ఫిర్యాదులతో సీఆర్‌ వైఖరి గురించి పూర్తి అవగాహనతో ఉన్న డిల్లీ పెద్దలు చిరంజీవికి చిన్న సైజు జలక్‌ ఇచ్చారు. సీఆర్‌ తరఫున దాదాపు సారీ చెప్పిన చిరంజీవి.. మొత్తానికి ఆయన మీద వేటు పడకుండా ఉండేలా హామీ పొందారు. అలాగే రామచంద్రయ్య ఇక మీదట ఎక్స్‌ట్రాలు మాట్లాడకుండా ఉండేలా హామీ ఇచ్చి వచ్చారు.

ఆ మేరకు రామచంద్రయ్యకు ఫోన్‌చేసి మెత్తగానే మందలించినట్లు సమాచారం. ఇప్పటికైతే తాను కాపాడగలిగానని... ఇలా ప్రతిసారీ సాధ్యం కాదని.. నోటిని కాస్త అదుపులో పెట్టుకుని సాగాలని చిరంజీవి సీఆర్‌కు హితబోధ చేసినట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కిరణ్‌ బర్తరఫ్‌ సంకేతాల బెదిరింపుతో సీఆర్‌కే కాదు, చిరంజీవికి కూడా ఒక క్లారిటీ వచ్చినట్లుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English