ఈ తండ్రికొడుకుల సీఎం సీటు ఆవేద‌నకు 29 ఏళ్లు

ఈ తండ్రికొడుకుల సీఎం సీటు ఆవేద‌నకు 29 ఏళ్లు

ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో భాగంగా హాట్ హాట్ ప‌రిణామాల్లో మ‌రో ఆస‌క్తిక‌ర వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి విషయంలో మూడుదశాబ్దాల తర్వాత చరిత్ర పునరావృతమైంది. నాడు కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా, నేడు ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా.. ఇద్దరికీ ముఖ్యమంత్రి పీఠం అందని ద్రాక్షగానే మిగిలింది.  తీవ్ర కసరత్తు తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది.

యువనేత జ్యోతిరాదిత్య సింధియా కూడా సీఎం పదవిని ఆశించినప్పటికీ.. కమల్‌నాథ్‌నే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎంపిక చేశారు. ఈ మేరకు కమల్‌నాథ్‌ను సీఎంగా నిర్ణయించినట్లు గురువారం రాత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, ఇలాగే జ్యోతిరాదిత్య తండ్రికి సైతం సీఎం ప‌ద‌వి మిస్ అయింది.

మధ్యప్రదేశ్‌లో కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, యువనేత జ్యోతిరాదిత్య సింధియా పోటీపడ్డారు.త్వరలో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నందున బీజేపీని ధీటుగా ఎదుర్కోవడానికి అనుభవజ్ఞులైన నేతలే సీఎంలుగా ఉండాలని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం.ఆ మేరకు ముందుగా జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడిన రాహుల్.. తర్వాత కమల్‌నాథ్‌తో విడిగా భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో 15నిమిషాలపాటు ఆయన చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, సోదరి ప్రియాంకలతో చర్చించిన రాహుల్.. ఏఐసీసీ ముఖ్య నేతల అభిప్రాయాలనూ తెలుసుకున్నారు. చివరకు మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ వైపే మొగ్గుచూపిన ఆయన.. అసంతృప్తికి గురైన జ్యోతిరాదిత్యను బుజ్జగించినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా కమల్‌నాథ్, జ్యోతిరాదిత్యలతో చేతులు కలుపుతూ తాను దిగిన ఓ ఫొటోను రాహుల్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. సహనం, సమయం.. రెండూ అత్యంత శక్తిమంతులైన యోధులు అన్న టాల్‌స్టాయ్ మాటల్ని ఆ పోస్టులో ఆయన ప్రస్తావించారు. అధిష్ఠానం ఆమోదంతో ఢిల్లీనుంచి భోపాల్‌కు చేరుకున్న కమల్‌నాథ్.. గురువారం రాత్రి పదిగంటలకు సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. కమల్‌నాథ్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకుంటూ సమావేశం తీర్మానించింది. దీంతో ఆయన ప్రమాణస్వీకారానికి మార్గం సుగమమైంది.

1989లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌సింగ్.. చుర్హత్ లాటరీ కుంభకోణంలో చిక్కుకున్నారు. దాంతో ఆయన గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే కాంగ్రెస్‌లో ముఖ్య నేతగా కొనసాగుతున్న మాధవరావు సీఎంగా తననే ఎంపిక చేస్తారని భావించారు. అయితే సీఎం పదవి ఆయనకు దక్కకుండా అధిష్టానం వద్ద అర్జున్ సింగ్ చక్రం తిప్పడంతో మాధవరావు సింధియాకు నిరాశే మిగిలింది. సేమ్ సీన్ ఆయ‌న త‌న‌యుడు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. తన తండ్రికి ఎదురైన చేదు అనుభవాన్ని 29 ఏళ్ల‌ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కూడా చవిచూడాల్సి వచ్చింది. 15 ఏళ్ల‌ విరామం తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నా.. జ్యోతిరాదిత్యకు నిరాశే మిగిలింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English