ప్ర‌తిప‌క్షాల మ‌హాకూటమి..ఎవ‌రికి ఎన్ని సీట్లంటే

ప్ర‌తిప‌క్షాల మ‌హాకూటమి..ఎవ‌రికి ఎన్ని సీట్లంటే

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. కేసీఆర్‌ను  ఓడించేందుకు పార్టీలన్నీ ఏకమై మహాకూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్ప‌టికే చ‌ర్చ‌లు దాదాపుగా పూర్త‌య్యాయి.

కాంగ్రెస్ సార‌థ్యంలోని ఈ కూట‌మిలో టీడీపీ, సీపీఐ, టీజేఏస్‌, ఇతర చిన్నాచితక పార్టీలతో పొత్తులకు సంబంధించిన ప్రాథ‌మిక చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. మ‌రోవైపు జ‌న‌సేన పార్టీ, సీపీఎం జ‌ట్టుక‌డుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో దోస్తీతో ఎన్నిక‌ల బ‌రిలో దిగుతుండ‌గా....బీజేపీ సొంతంగానే ఎన్నిక‌ల గోదాలో ఉండాల‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో అంద‌రి చూపు కూట‌మి టికెట్ల‌పై ప‌డింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీయే సీట్ల కేటాయింపుపై తుది నిర్ణ‌యం తీసుకోనుంద‌ని తెలుస్తోంది. టీపీడీకి 14 సీట్లు కేటాయించి, సీపీఐకి నాలుగు లేదా ఐదు సీట్లు ఇచ్చేలా ప్రాథమిక ఒప్పందం కుదిరినట్టు కాంగ్రెస్‌ అంతర్గత చర్చల్లో నేతలు చెబుతున్నారు.

ఇక ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సార‌థ్యంలోని టీజేఎస్ విష‌యంలోనే కాంగ్రెస్ నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ పార్టీ పొత్తుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉండ‌టం...ఎక్కువ సీట్లు కోరుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు అసంతృప్తితో ఉన్నారు.

కూటమిలో చేరాలంటే కనీసం 30 అసెంబ్లీ స్థానాలు కోరాలని టీజేఎస్ భావించిన నేప‌థ్యంలో ఆ పార్టీతో అంటీముట్ట‌న‌ట్లు ఉంటున్న‌ట్లు సమాచారం. తెలంగాణ ఇంటిపార్టీకి ఒక స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఒక‌ట్రెండు రోజుల్లో తుది ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు స‌మాచారం.

కాగా, అధికారికంగా చెప్పనప్పటికీ టీడీపీతో కాంగ్రెస్‌ చర్చలు సఫలమైనట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, కొన్ని సీట్ల విష‌యంలో చిక్కుముడి ఉందంటున్నారు. అందుకే పొత్తుల ప్ర‌క‌ట‌న అధికారికంగా వెలువ‌డ‌టంలో జాప్యం జ‌రుగుతోంద‌ని అంటున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడు, ఏఐసీసీ జాతీయ నేత గులాంనబీ ఆజాద్ సార‌థ్యంలో పొత్తుల ప్ర‌క్రియ‌కు పుల్ స్టాప్ ప‌డ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ బుధ‌వారం రాష్ట్రానికి రానున్న ఆజాద్ టీడీపీ-సీపీఐ-టీజేఎస్‌, ఇంటి పార్టీ నేతలతో నేరుగా సమావేశం కానున్నారు. ఆయా పార్టీల నేతలు ఆజాద్‌తో సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో పొత్తులు, సీట్లు ఇతరత్రా విషయాలపై మరింత స్పష్టత రానుంది. తదనంతరం పార్టీ అభ్యర్థులు, ప్రచారం, మ్యానిఫెస్టోలు, పొత్తులు, సీట్లు తదితర అంశాలపై కాంగ్రెస్ సార‌థ్య‌కంలోని కూట‌మి ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English