దెబ్బకు దిగొచ్చిన మోడీ.. అద్వానీకి మరో చాన్స్!

దెబ్బకు దిగొచ్చిన మోడీ.. అద్వానీకి మరో చాన్స్!

బీజేపీ రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. వరుస ఓటములు బీజేపీలోని సీనియర్ నేతలకు మళ్లీ మంచి రోజులు తీసుకొచ్చేలానే ఉన్నాయని చ‌ర్చ సాగుతోంది. ఉప ఎన్నికల్లో ఓటములు, ప్రతిపక్షాల ఐక్యత బీజేపీకి బాగానే గుణపాఠాలు నేర్పిస్తున్నట్లుంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దిగి వస్తున్నారు. ఇందుకు ఒక‌దాని వెంట మ‌రొక‌టిగా సాగుతున్న ప‌రిణామాలే నిద‌ర్శ‌న‌మంటున్నారు.

ఇప్పటికే ఎన్డీయేకు దూరమవుతున్న మిత్రులను మళ్లీ దగ్గరికి తెచ్చుకునే పనిలో అమిత్ షా ఉన్నారు. బుధవారం ముంబైలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను షా కలవబోతున్నారు. తాజాగా పార్టీలోని సీనియర్లను కూడా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు బెంగాల్‌కు చెందిన ఆనంద్‌బజార్ పత్రిక ఓ కథనం రాసింది. ప్ర‌ధానంగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి ఆ పార్టీలో మ‌రోమారు పెద్దపీట వేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పెట్టిన కొత్త రూల్ ప్రకారం 75 ఏళ్లు మించిన వాళ్లను పార్టీలో పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు వరుసగా తగులుతున్న షాక్‌లు ఈ నిబంధనపై మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయని అంటున్నారు. వయసుది ఏముంది గెలిచేవాళ్లు కావాలి అని మోడీ, షా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొత్త‌గా తెర‌మీద‌కు వ‌చ్చిన చ‌ర్చ‌ప్ర‌కారం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలోని కురువృద్ధులు ఎల్‌కే అద్వానీతోపాటు మురళీమనోహర్ జోషిలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అద్వానీ గాంధీనగర్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైనా.. ఆ తర్వాత పార్టీలో ఆయనను పూర్తిగా పక్కనపెట్టేశారు. అటు జోషికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ ఇద్దరు వెటరన్లు ఏదో పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లు కొనసాగుతున్నారు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకొనే పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా అద్వానీ, జోషిలను అమిత్ షా తప్పించారు. మార్గదర్శక మండలి పేరుతో ఓ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి అందులో వీళ్లకు అవకాశం ఇచ్చినా.. ఇప్పటివరకు అది ఒక్కసారీ సమావేశమైంది లేదు. పార్టీలోని సీనియర్లతో మోదీ, షా వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో నష్టాన్ని పూడ్చుకునే పనిలో వీళ్లు ఉన్నారు. ఈ మధ్యే అద్వానీ ఇంటికి వెళ్లి మరీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా ఆయనను మోడీ, షా కోరినట్లు ఆనంద్ బజార్ పత్రిక కథనం వెల్లడించింది. మొత్తంగా బీజేపీలో కీల‌క నిర్ణ‌యాలు ఖాయ‌మంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు