'రైతులకు చంద్రబాబు రూ.4894 కోట్లు ఎగ్గొట్టారు'

'రైతులకు చంద్రబాబు రూ.4894 కోట్లు ఎగ్గొట్టారు'

ఏపీ సీఎం చంద్రబాబు గత మూడేళ్లలో రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద రూ.4894కోట్లు ఎగనామం పెట్టారని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. గుంటూరులోని రైతుదీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలో ముష్టి వేసినట్లుగా కనీస మద్దతు ధరలు పెంచారన్నారు. కనీస మద్దతు ధరపై ఒక్కసారి కూడా ప్రధానికి లేఖ రాయలేదన్నారు. స్వామినాథన్‌ ఎవరో తెలియదన్నట్లుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారన్నారు.
   
చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని...  రాష్ట్రంలో కోటి మంది రైతులుంటే 40లక్షల మంది రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు.  మిర్చి ధర క్వింటా 2వేలకు పడిపోయిందన్నారు. చంద్రబాబు రైతులకు కాకుండా వ్యాపారులకు తోడుగా నిలబడ్డాడన్నారు. 20క్వింటాళ్లు మాత్రమే అమ్ముకోవాలని నిబంధనలు పెడుతున్నారన్నారు.
   
చంద్రబాబు పాలనపై ఏ ఒక్కరూ సంతోషంగా లేరని...  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామన్న ఎన్నికల హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రైతులు పడుతున్న అవస్థలు చూసి మద్దతుగా దీక్ష చేపట్టామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. గతంలో హుడా సిఫార్సులను అమలు చేయాలని చంద్రబాబు అన్నారు, ఇప్పుడు అతనెవరో తెలియదన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న బాబు ఆమాటే మరిచిపోయారని ఆరోపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు