హిల్ల‌రీ ఓట‌మి వెన‌క ఏం జ‌రిగింది..!

హిల్ల‌రీ ఓట‌మి వెన‌క ఏం జ‌రిగింది..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అమెరికా ఎన్నిక‌ల్లో సర్వేలన్నీ తారుమారు అయ్యాయి. రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉండి, రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన  అగ్ర‌రాజ్యం మాజీ విదేశాంగ‌మంత్రి హిల్ల‌రీ క్లింట‌న్ భారీస్థాయిలో ఓట‌మి చ‌విచూశారు. అదేస‌మ‌యంలో ఎంత‌మాత్రం రాజ‌కీయంగా అనుభ‌వం లేని, దుందుడుకు మాట‌ల‌తో అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకున్న రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ ఘ‌న విజ‌యం సాధించారు. ఈ విజ‌యాన్ని వాషింగ్ట‌న్ పోస్ట్ వంటి ఒక‌టి రెండు ప‌త్రిక‌లు త‌ప్ప ప్రపంచ వ్యాప్త మీడియా ఏదీ అంచ‌నా వేయ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి చెప్పాలంటే ట్రంప్ అన్న‌ట్టు .. దాదాపు మీడియా దిగ్గ‌జ సంస్థ‌ల‌న్నీ ఏక‌ప‌క్షంగానే వార్త‌లు గుప్పించాయి.

ట్రంప్ అధ్య‌క్షుడైతే ఏదో జ‌రిగిపోతుంద‌నే ప్ర‌చారం చేశాయి. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న విజ‌యం సాధించ‌డం ఎగ్జిట్ పోల్స్‌ను న‌మ్మాలా ? వ‌ద్దా? అనే స్థాయికి తీసుకువెళ్లింది.  వాస్త‌వానికి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్రారంభం నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య పోరు నువ్వా నేనా అన్న‌స్థాయిలో జ‌రిగింది. అయితే, మ‌ధ్య‌లో మ‌హిళ‌ల‌పై ట్రంప్ వ్యాఖ్య‌లు మంట పెట్టాయి. దీంతో ఆయ‌న వెనుక‌బ‌డి పోయారు.దీంతో హిల్ల‌రీపై ఆశ‌లు రెట్టింపు అయ్యాయి.

ఇక‌, బుధ‌వారం కౌంటింగ్ ప్రారంభ‌మ‌య్యాక కూడా ఇద్ద‌రి మధ్యా రిజ‌ల్ట్ యుద్ధ హోరా హోరీగా సాగింది. చివ‌రికి అగ్ర‌రాజ్యం అమెరికా 45వ అధ్య‌క్షుడిగా రియ‌ల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ అత్య‌ధిక మెజారిటీ సాధించి అధ్య‌క్ష పీఠాన్ని కైవ‌సం చేసుకున్నారు.  మొత్తం 538 ఓట్లున్న ఎలెక్టోరల్‌ కాలేజీలో ట్రంప్‌ స్పష్టమైన మెజార్టీ  మార్క్‌ 270 అధిగమించారు. ట్రంప్ 276 ఓట్లు సాధించారు. హిల్లరీ 218 ఓట్లతో స‌రిపెట్టుకున్నారు. ట్రంప్ కు 5,67,97,101 ఓట్లు, హిల్లరీకి 5,57,41,659 ఓట్లు వచ్చాయి.

ఇక హిల్ల‌రీ విష‌యానికి వ‌స్తే.. ఆమే గెలుస్తుంద‌ని పెద్ద ఎత్తున ఊహించినా ఎందుకు రిజ‌ల్ట్ రివ‌ర్స‌యింద‌ని ఇప్పుడు ప్ర‌పంచ మేధావులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. దీనికి ఉన్న కార‌ణాల‌పై విశ్లేష‌ణ‌లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రాథ‌మికంగా  ఆమె త‌న ప్ర‌చారంలో ఏకంగా 85 నినాదాలు ఇచ్చార‌ని, అయితే ట్రంప్ కేవలం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ అనే ఒకే ఒక్క స్లోగన్‌ తో ప్రచారం చేశారని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇదే గెలుపును ప్ర‌భావితం చేసింద‌ని భావిస్తున్నారు.

 అదేస‌మ‌యంలో తనపై ఎన్ని వ్యక్తిగత ఆరోపణలు వచ్చినా ట్రంప్‌ జాతీయ భావాన్నిమాత్రమే తన ప్రచారంలో వినిపించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తనకే ఉందని అమెరికన్లను ఒప్పించగలిగారు.  మరోవైపు డిగ్రీలు లేని శ్వేత జాతీయులు గంపగుత్తగా ట్రంప్‌ వైపు మొగ్గుచూపడం ఆయనకు కలిసొచ్చింది. నిరుద్యోగులు, నిరాక్షరాస్యులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచినట్టు స్పష్టమవుతోంది. ఏకంగా ఈ ప‌రిణామం ఎన్నో ఏళ్లుగా అధికారానికి దూర‌మైన రిప‌బ్లిక‌న్ల‌కు అగ్ర‌రాజ్యం పీఠం ద‌క్కేలా చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు