అలాంటి సీఎం కేసీఆర్ ఒక్క‌రేన‌ట‌

అలాంటి సీఎం కేసీఆర్ ఒక్క‌రేన‌ట‌

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్ నేత‌లు ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల‌ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, కోదండరెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి, మల్లు రవి తదితరులతో కలిసి ఉత్త‌మ్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్‌ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ సోయి తప్పి కాంగ్రెస్‌ పార్టీపైనా, తనపైనా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, సీఎం హౌదాలో కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఉత్త‌మ్ నిప్పులు చెరిగారు. తన హోదాను మరిచిపోయి..కనీస సంస్కారం లేకుండా వ్యక్తగత విమర్శలకు దిగితే సహించేది లేదన్నారు. ఇప్పుడున్న వారు తుగ్లక్‌ పరిపాలన చూడలేదని, బహుషా సీఎం పాలనలాగే తుగ్లక్‌ పాలనలా ఉండొచ్చనని, అందుకే సీఎం పాలనను తుగ్లక్ పాలన అంటున్నారని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

సోయి మర్చిపోయి ఫాంహౌస్‌లో పడుకుని మీలాగా సడన్‌గా లేచి మాట్లాడటం లేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మండిప‌డ్డారు. మాట్లాడే ముందు సీఎం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టమెచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదీ లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు సోయి ఉంది కాబట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కాంగ్రెస్‌ నేతలకు సోయి ఉంది కాబట్టే తెలంగాణలో పర్యటించామన్నారు. దేశంలో కేసీఆర్‌ లాంటి ముఖ్యమంత్రి లేడని ఉత్త‌మ్ విమ‌ర్శించారు. ప్రజలంటే సీఎంకు లెక్కలేనితనంగా ఉందని, ఎమ్మెల్యేలు, మంత్రులను కలవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాత్రమే చూస్తున్నానన్నారు. ఉద్యమ సందర్భంగా అనేక అబద్దాలు మాట్లాడిన కేసీఆర్‌...సీఎం స్థాయిలోనూ నిస్సిగ్గుగా అబద్దాల పరంపర కొనసాగిస్తున్నారని విమర్శించారు. తనను వ్యక్తగతంగా విమర్శించిన సీఎంను ఇంక నుంచి ఏకవచనంతో సంబోధిస్తామని ఉత్త‌మ్ అన్నారు. తెలంగాణ ప్రజాధనాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. మిషన్‌కాకతీయకు, వాటర్‌ గ్రిడ్‌కు నిధులు ఉన్నాయి కానీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవా? అని ప్రశ్నించారు. పంట నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే.. వారు సంబురాలు చేసుకుంటున్నారని కేసీఆర్‌ అనడాన్ని దుయ్యబట్టారు. రైతుల కష్టాలు ఏమిటో, వారు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారో, తెలుసుకునేందుకు పోలీసులను, గన్‌మెన్లను పక్కనబెట్టి దమ్ముంటే పంట పొలాల్లో రా...తేల్చుకుందాం అంటూ సవాల్‌ విసిరారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతుల కన్నీళ్లను చూసిన తర్వాతే మాట్లాడుతున్నామన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు