నాని బౌలింగ్... వెంకీ సిక్సర్లు

నాని బౌలింగ్... వెంకీ సిక్సర్లు

ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ ఎలా కొత్త పుంతలు తొక్కుతోందో చూస్తున్నాం. ఏదీ మామూలుగా చేస్తే జనాల దృష్టిని ఆకర్షించలేరు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించాల్సిందే. ఆడియో, ప్రి రిలీజ్ ఈవెంట్లు కూడా వైవిధ్యంగా నిర్వహించి జనాల్లో చర్చనీయాంశం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా నేపథ్యానికి తగినట్లు ఈవెంట్లు చేయడం ద్వారా తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ‘జెర్సీ’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఇలాగే ప్లాన్ చేశారు. ఇది క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే దీని ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. యాంకర్ సుమ క్రికెట్ దుస్తులు, ప్యాడ్లు ధరించి స్టేజ్ మీదికి రావడంతోనే ఈ ఈవెంట్ డిఫరెంట్ అనే విషయం అర్థమైంది. ఇక ఆ తర్వాత చిత్ర బృందంలోని వారితో, అతిథులతో స్టేజ్ మీదే సరదాగా క్రికెట్ ఆడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘జెర్సీ’ టీం మెంబర్స్, అతిథులందరినీ కలిపి రెండు జట్లుగా విభజించి వారి మధ్య మ్యాచ్ నిర్వహించారు ఈ ఈవెంట్లో. ఈ జట్టు నుంచి ఒకరు, ఆ జట్టు నుంచి ఒకరు అన్నట్లుగా ఎంచుకుని ఒకరితో బ్యాటింగ్ చేయించి, ఇంకొకరితో బౌలింగ్ వేయించారు. ఈవెంట్ చివర్లో వెంకీ-నాని మధ్య పోరు సాగింది. టాస్ గెలిచిన వెంకీ బ్యాటింగ్ ఎంచుకోగా.. నాని ఆయనకు బౌలింగ్ చేశాడు. ఎడమ చేతి వాటంతో బ్యాటింగ్ చేసిన వెంకీ.. నాని బంతుల్లో స్టేజ్ మీది నుంచి జనాల్లోకి కొట్టాాడు. ఆయన రెండు మూడు దాకా సిక్సర్లు బాదాడు. టెన్నిస్ బంతే కావడంతో జనాల మీదికి దూసుకెళ్లినా ఇబ్బంది లేకపోయింది.

తర్వాత నానిని బ్యాటింగ్ చేయమని అంటే.. నా బ్యాటింగ్ ఏప్రిల్ 19న అని చెప్పేసి బ్యాట్ ముట్టుకోలేదు. మరోవైపు దర్శకుడు సుధీర్ వర్మ బౌలింగ్ చేయగా.. మరో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ భారీ షాట్లు ఆడాడు. ఆయన కూడా సిక్సర్ల మీద సిక్సర్లు బాదాడు. సుమ తనదైన హాస్య చతురతతో ఈవెంట్‌ను నడిపిస్తే దీనికి మరింత కళ తెచ్చింది. మొత్తంగా ఈవెంట్ సూపర్ హిట్ అనడంలో సందేహం లేదు. సినిమా కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English