రామ్ గోపాల్ వర్మ నుంచి సందీప్ రెడ్డి వంగ వరకు బాలీవుడ్లో జెండా ఎగరేసిన టాలీవుడ్ దర్శకుల లిస్ట్ పెద్దదే. వర్మ కంటే ముందు ఆదుర్తి సుబ్బారావు, రాఘవేంద్రరావు, బాపు లాంటి లెజెండరీ డైరెక్టర్లు హిందీలో సినిమాలు తీసి హిట్లు కొట్టారు. ఇప్పుడు అక్కడ సందీప్ రెడ్డి హవా నడుస్తోంది. ఇదే సమయంలో మరికొందరు యువ దర్శకుల చూపు బాలీవుడ్ మీద పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ, వంశీ పైడిపల్లి.. ఇలా వరుసగా బాలీవుడ్‌కు వెళ్లే తెలుగు దర్శకుల గురించి వార్తలు వస్తున్నాయి. ఇందులో వంశీ పేరు రెండు రోజులుగా గట్టిగా వినిపిస్తోంది. బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో వంశీ ఓ హిందీ చిత్రం తీయబోతున్నాడని.. వంశీ సినిమాలు చాలా వరకు తనే నిర్మించిన దిల్ రాజే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడని ఓ ప్రచారం నడుస్తోంది. ఐతే ఈ ప్రచారాన్ని వంశీ ఖండించడం గమనార్హం.
ఓ ఇంగ్లిష్ మీడియా సంస్థ ఈ వార్త గురించి అడిగితే.. అది రూమర్ అని తేల్చేశాడు వంశీ. మరి మీ తర్వాతి సినిమా ఏంటి అనంటే.. దాని మీద కసరత్తు జరుగుతోందని.. సరైన సమయంలో ఆ ప్రాజెక్టు గురించి వెల్లడిస్తామని వంశీ తెలిపాడు. వంశీ చివరగా తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వారిసు తీశాడు. మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకున్న ఆ చిత్రం తమిళంలో బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. తర్వాత విజయ్‌తోనే ఇంకో సినిమా చేయడానికి వంశీ ప్రయత్నించాడు కానీ కుదరలేదు. ఇప్పుడు అతడి చూపు బాలీవుడ్ మీద పడిందంటున్నారు. మరి వంశీ తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి.