చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌.. మరోసారి కలుద్దామన్న షా

మాజీ సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. ఏపీలో ప్రస్తుతమున్న పరిస్థితులపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఇటీవల ఏపీలో జరిగిన పరిణామాలపై అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్ చేసి వివరించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్ చేశారు. కశ్మీర్ పర్యటన నుంచి మంగళవారం ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా కలవలేకపోయానని అమిత్‌షా వివరించారు. మరోసారి కలుద్దామని ఫోన్‌లో కేంద్రమంత్రి చెప్పారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేశానని చంద్రబాబు అమిత్‌షాకు తెలిపారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణ రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం అంశాలను అమిత్‌షా దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారు. ఏపీలో ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చంద్రబాబు, అమిత్‌షాకు వివరించారు. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుపడినా దాని మూలాలు ఏపీలో ఉండడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
టీడీపీ నేతలపై దాడులు, విధ్వంసాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని అమిత్‌షాను చంద్రబాబు కోరారు. ఈ అంశంపై పరిశీలిస్తానని చంద్రబాబుకు అమిత్‌షా చెప్పారు.

టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు తదితర అంశాలను వివరించేందుకు రెండు రోజల క్రితం చంద్రాబాబు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో అమిత్‌షాను చంద్రబాబు కలవాలని అనుకున్నారు. అయితే అమిత్‌షా కశ్మీర్ పర్యటన వల్ల కలవలేకపోయారు. ఇదే విషయాన్ని అమిత్‌షా పేషీ అధికారులు చంద్రబాబు బృందానికి సమాచామిచ్చారు.

ఈ నెల 19న ఏపీ జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ బృందం ఢిల్లీ పెద్దలను కలిశారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి రాష్ట్రపతికి వివరించారు.

అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు, నేతలపై వరుసగా జరిగిన క్రూరమైన దాడుల విషయంలోనూ సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీడీపీ బృందం కోరింది. రాజ్యాంగపరమైన విధులను, బాధ్యతలను విస్మరిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను రీకాల్‌ చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని చంద్రబాబు కోరారు.