బుల్లితెర బాహుబలి మొదలవుతోంది

బుల్లితెర బాహుబలి మొదలవుతోంది

‘బాహుబలి’ లాంటి భారీ చిత్రం తీసిన నిర్మాతల నుంచి ఇప్పటిదాకా మరో సినిమా రాలేదు. వాళ్లకు వెంటనే సినిమా తీసే ఆలోచన ఉన్నట్లు కూడా కనిపించలేదు. ఐతే శోభు యార్లగడ్డ.. ప్రసాద్ దేవినేని ఏడాదిగా ఖాళీగా ఏమీ లేరు. ‘బాహుబలి’ తరహాలో మరో భారీ ప్రయత్నం చేశారు. ఐతే అది సినిమా కాదు.. సీరియల్. ఈటీవీ భాగస్వామ్యంతో బాహుబలి నిర్మాతలు ‘స్వర్ణఖడ్గం’ పేరుతో సీరియల్ తీయడం విశేషం.

‘బాహుబలి’ తరహా కథాంశంతోనే భారీగా ఈ సీరియల్ నిర్మించారు శోభు.. ప్రసాద్. ఈ టీవీలో ఈ రోజు నుంచే ఈ సీరియల్ మొదలవుతోంది. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఇంత భారీ సీరియల్ ఇప్పటిదాకా రాలేదని.. దీన్ని బుల్లితెర బాహుబలిగా చెప్పుకోవచ్చని అంటున్నాడు శోభు. తమ సీరియల్ గురించి ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘‘బాహుబలి సినిమాతో ఐదేళ్లు ప్రయాణించి ఎంతో అనుభవం సంపాదించాం. ‘బాహుబలి’ స్ఫూర్తితో హిందీలో కొన్ని సీరియల్స్‌ వచ్చాయి. తెలుగులో అలాంటి ఓ సీరియల్‌ చేస్తే బాగుంటుంది అని ఈటీవీ వారు ఇచ్చిన సలహా, సూచనతో ఈ సీరియల్ మొదలైంది. ఈటీవీ వాళ్లతో మా ఆర్కా మీడియా బృందం కలిసి ఈ సీరియల్ ను భారీ స్థాయిలో తీర్చిదిద్దారు. బాహుబలి టీంలో పని చేసిన నిపుణులు ఈ సీరియల్‌కు పనిచేశారు. సాధారణంగా ధారావాహిక అంటే ఓ రెండు మూడు నెలలు ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేసి సెట్స్‌పైకి తీసుకొచ్చేస్తారు. కానీ ‘స్వర్ణఖడ్గం’ కోసం 14 నెలలు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేశాం. ‘బాహుబలి’ స్థాయిలో ఉండాలి కానీ ‘బాహుబలి’తో పోల్చేలా ఉండకూడదని అన్నీ కొత్తగా చేశాం. రామోజీ ఫిలింసిటీ, కేరళల్లో చిత్రీకరణ జరిపాం. దక్షిణాదిలోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సీరియల్‌ తెరకెక్కింది.  ‘స్వర్ణఖడ్గం’లో బోలెడంత ఫాంటసీ ఉంటుంది. ‘బాహుబలి’కి ఎలాగైతే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చుపెట్టామో ఈ ధారావాహిక కోసమూ బడ్జెట్‌ దాటి ఖర్చుచేశాం. బడ్జెట్‌ రెట్టింపైనా ఒక్కో సీజన్‌కు తక్కువలో తక్కువ ఓ మూడువందల ఎపిసోడ్లు చేయాలనుకుంటున్నాం. కనీసం ఓ 30 ఎపిసోడ్లకు ఓసారి ఊహించని మలుపు, థ్రిల్‌ ఉండేలా కథను తీర్చిదిద్దాం. ఓ విధంగా చెప్పాలంటే ఓ సినిమా తీసి బుల్లితెరపై చూపిస్తున్నాం’’ అని శోభు చెప్పాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు