నాని సరే.. మీ మాటేంటి హరీష్ సార్?

నాని సరే.. మీ మాటేంటి హరీష్ సార్?

తమ సినిమాలు ఫ్లాపైన విషయాన్ని వెంటనే అంగీకరించడానికి ఆ చిత్ర బృందంలోని వాళ్లెవ్వరికీ మనసొప్పదు. కొన్ని నెలలు.. ఏళ్లు గడిచాక కానీ తమ సినిమా పోయిందన్న మాట వాళ్ల నోటి నుంచి రాదు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం తాను ఆ టైపు కాదని రుజువు చేశాడు. తన కొత్త సినిమా‘కృష్ణార్జున యుద్ధం’ విడుదలైన నెలన్నర కూడా కాకముందే ఆ సినిమా ఆడలేదని.. అది హిట్టు కాదని స్పష్టం చేశాడు. ఈ విషయమై అతను వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నాని రూటే వేరంటూ ప్రశంసలు తెచ్చి పెడుతోంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే..  గత నెల 12న విడుదలై ఫ్లాప్ అయిన నాని కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని తాజాగా యప్ టీవీ డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేసింది. దీని గురించి డిస్క్రిప్షన్ ఇస్తూ నాని నటించిన సూపర్ హిట్ మూవీ అని పేర్కొంది. దీనిపై నాని స్పందించాడు. ‘‘సూపర్ హిట్ అంట.. అవ్వలేదు బాబాయ్.. ఆడలేదు కూడా. అయినా మనసు పెట్టి చేశాం.. చూసేయండి’’ అని ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచాడు నాని.

డిజాస్టర్లు తీసి కూడా బ్లాక్ బస్టర్ అని అదే పనిగా ప్రచారం చేసుకుంటుంటారు సినీ జనాలు. అలాంటి ఇండస్ట్రీలో నానీలా ఓపెన్‌గా తన సినిమా ఆడలేదని ఇంత త్వరగా ఒప్పుకునేదెవరు? ఈ ట్వీట్ చూసి చాలామంది స్పందించారు. అందులో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఉన్నాడు. నాని యాటిట్యూడ్ సూపరన్నాడు. కాకపోతే నానిని పొగిడిన హరీష్ పోయినేడాది తన సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలో ఇలాంటి నిజాయితీ చూపించి ఉంటే బాగుండేది. ఆ సినిమా గురించి నెగెటివ్ రివ్యూలు ఇచ్చినందుకు మీడియా మీద పడ్డాడు. నెగెటివ్‌గా మాట్లాడిన వాళ్లందరినీ తిట్టిపోశాడు. చివరికి చూస్తే ‘దువ్వాడ జగన్నాథం’ నష్టాలు మిగిల్చిందని స్వయంగా నిర్మాత దిల్ రాజే ఒప్పుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English