ఏప్రిల్ 27నే కాలా?

ఏప్రిల్ 27నే కాలా?

నెలన్నర రోజులకు పైగా సాగుతున్న తమిళ సినిమాల సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో తమిళ నిర్మాతల చర్చలు ఓ కొలిక్కి రావడంతో సమ్మె ఆపేస్తున్నట్లు నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ప్రకటించాడు. అంతే కాదు.. వచ్చే వారం నుంచి సినిమాలు యధావిధిగా, ముందు అనుకున్న ప్రకారమే విడుదలవుతాయని విశాల్ స్పష్టం చేశాడు.

మరి ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్ 27నే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కాలా’ విడుదలవుతుందా అని విశాల్‌ను ప్రశ్నిస్తే.. ‘‘అదే నేను ఇంతకుముందే చెప్పాను. బుధవారం నిర్మాతలందరం కూర్చుని మాట్లాడతాం. సినిమాల విడుదల తేదీలు ఖరారు చేస్తాం. ఈ నెలన్న రోజుల్లో షెడ్యూల్ అయిన చాలా సినిమాలు ఆగిపోయాయి. ఈ సినిమాలన్నింటికీ ఒక ఆర్డర్లో రిలీజ్ డేట్లు ఖరారు చేస్తాం. ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే జాబితా కూడా ప్రకటిస్తాం. ఒక శుక్రవారానికి గరిష్టంగా మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తాం. పెండింగ్ ఉన్న సినిమాలన్నింటినీ రాబోయే రెండు నెలల్లో క్లియర్ చేస్తాం’’ అని విశాల్ తెలిపాడు.

విశాల్ మాటల్ని బట్టి చూస్తే ‘కాలా’ ముందు అనుకున్నట్లే ఏప్రిల్ 27న విడుదల కావాలి. ఐతే అందుకు నిర్మాత ధనుష్ రెడీగా ఉన్నాడా లేదా అన్నది తెలియాలి. సమ్మె కారణంగా సినిమాల ప్రదర్శనే కాదు.. ఇతర కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. ‘కాలా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పది రోజుల్లోపు సినిమాను విడులకు సిద్ధం చేయడమంటే అంత సులువు కాదు. మరి ‘కాలా’ టీం ఏం చేస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు