కొరటాల తగ్గట్లేదుగా..

కొరటాల తగ్గట్లేదుగా..

సీరియస్‌గా సినిమాలు చేసుకునే వాళ్లు రాజకీయాల గురించి మాట్లాడితే జనాల్లో ఆసక్తి కలుగుతుంది. అందులోనూ ఏవైనా కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నపుడు ఫిలిం సెలబ్రెటీలు బాధ్యతాయుత రీతిలో స్పందించినా.. హాట్ కామెంట్స్ చేసినా జనాల నుంచి స్పందన కూడా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని నిన్న కేంద్ర ప్రనభుత్వం స్పష్టం చేయడం.. కాసేపటికే కేంద్ర కేబినెట్ నుంచి ఏపీ మంత్రులు బయటికి రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ ఆసక్తికర కామెంట్ చేశాడు. తన కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ టీజర్లో హీరో తరహాలో మాట నిలబెట్టుకుని మోడీ ‘మ్యాన్’ అనిపించుకోవాలని కొరటాల కామెంట్ చేశాడు.

దీనిపై చాలా వరకు పాజిటివ్ అప్లాజ్ వచ్చింది కానీ.. కొందరు కొరటాలకు కౌంటర్లు కూడా వేశారు. మోడీని మాత్రమే ఇలా ప్రశ్నిస్తారా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట తప్పాడు కదా.. ఆయన్ని ప్రశ్నించరా అని కొందరు.. మీరు తెలుగుదేశం మద్దతుదారా అని ఇంకొందరు అన్నారు. సినిమా ప్రమోషన్ కోసమే కొరటాల కామెంట్ చేశాడని.. ఇన్నాళ్లూ ఏమైపోయాడని ప్రశ్నించిన వాళ్లు కూడా ఉన్నారు. ఐతే ఈ కామెంట్లకు కొరటాల ఏమీ బెదరలేదు. ఇక్కడికి రాజకీయాలు తీసుకురావద్దని గట్టిగా చెప్పిన కొరటాల.. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు అందరూ కలిసి కట్టుగా స్పందిస్తారని... ఇప్పుడు రాష్ట్రానికి జరిగింది అలాంటి విపత్తే అని తాను భావించిన స్పందించానని.. ఒక పౌరుడిగా ఇలా మాట్లాడానని.. ఇకపైనా ఇలాగే మాట్లాడతానని కొరటాల స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కొరటాల కోరాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు