నాగ్ పబ్లిసిటీ ఎత్తుగడ చూశారా?

నాగ్ పబ్లిసిటీ ఎత్తుగడ చూశారా?

తన చిన్న కొడుకు అఖిల్ అక్కినేని సినిమా ‘హలో’కు సంబంధించి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు కూడా పూర్తయిపోవడం.. ఆ చిత్ర థియేట్రికల్ రన్ ముగింపు దశకు వచ్చేయడంతో తన ప్రొడక్షన్లో రాబోతున్న తర్వాతి సినిమా మీద దృష్టిపెట్టాడు అక్కినేని నాగార్జున. ఇంతకుముందు ‘ఉయ్యాల జంపాల’ అనే చిన్న సినిమాతో రాజ్ తరుణ్‌ను హీరోగా పరిచయం చేసిన ఆయన.. ఇప్పుడు అదే హీరోతో చడీచప్పుడు లేకుండా ‘రంగుల రాట్నం’ అనే సినిమాను పూర్తి చేసేశాడు.
శ్రీరంజని అనే లేడీ డైరెక్టర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.

ఈ చిత్రాన్ని ఉన్నట్లుండి సంక్రాంతి రేసులోకి తెచ్చేశాడు నాగ్. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విశేషాన్నీ సోషల్ మీడియాలో పంచుకోలేదు. ఒక్క ప్రెస్ నోట్ కానీ.. ఒక్క యాడ్ కానీ లేదు. కేవలం విడుదలకు పది రోజుల ముందు ఈ చిత్రాన్ని వార్తల్లోకి తీసుకొచ్చాడు నాగ్. నిన్ననే ‘రంగుల రాట్నం’ ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. దీని థియేట్రికల్ ట్రైలర్ బుధవారం రిలీజవుతుందని కూడా అందులోనే ప్రకటించారు. ఐతే ఈ ఫస్ట్ లుక్‌ను డిజైన్ చేసిన తీరు జనాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయి రెండు రోజులుగా మీడియాలో నానుతున్నాడు. అతను ఇంతకుముందు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ నీతులు చెప్పి.. ఇప్పుడు ఎలా దొరికిపోయాడూ చూపిస్తూ ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. ఇలాంటి తరుణంలో ‘రంగుల రాట్నం’ ఫస్ట్ లుక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నేపథ్యంలో తీర్చిదిద్దడం విశేషం. హీరో రాజ్ తరుణ్ బైక్ మీద వెనుక కూర్చుని ఉంటే.. ముందు బండి నడుపుతున్న హీరోయిన్ బ్రీత్ అనలైజర్‌లో గాలి ఊదుతోంది. ప్రదీప్ ఇష్యూ మీడియాలో నానుతున్న నేపథ్యంలో కావాలనే నాగ్ టీం ఇలా ఫస్ట్ లుక్ తీర్చిదిద్దిందనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి వాళ్ల ఉద్దేశం అదేనా? లేక యాదృచ్ఛికంగా ఇలా జరిగిందా అన్నది యూనిట్ సభ్యులకే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English