అనుష్కతో మంచు విష్ణు అమీతుమీ

అనుష్కతో మంచు విష్ణు అమీతుమీ

గత ఏడాది ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో మంచి విజయాన్నందుకున్న మంచు విష్ణును ఈ ఏడాది ‘లక్కున్నోడు’ పెద్ద దెబ్బే కొట్టింది. అసలు అతడికే కాదు.. మంచు ఫ్యామిలీలో అందరికీ ఈ ఏడాది చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మంచు లక్ష్మి నటించిన ‘లక్ష్మీబాంబు’.. మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఒక్కడు మిగిలాడు’ కూడా దారుణమైన పలితాన్నందుకున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ఇలాంటి అనుభవాలు ఎదురు కాకుండా చూసుకోవాలని  మంచు ఫ్యామిలీ పట్టుదలతో ఉంది. 2018లో ముందుగా మంచు విష్ణు సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. జనవరి 26న విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విష్ణుతో ‘దేనికైనా రెడీ’.. ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి హిట్లిచ్చిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో ‘ఆచారి అమెరికా యాత్ర’పై అంచనాలు బాగానే ఉన్నాయి. రెండు మూడేళ్లుగా లైమ్ లైట్లో లేకుండా పోయిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. నిజానికి వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వారాంతంలో ‘2.0’ రావాల్సింది.

ఆ సినిమా వాయిదా పడటంతో అనుష్క సినిమా ‘భాగమతి’ని జనవరి 26కు ఫిక్స్ చేశారు. ఇప్పుడు విష్ణు సినిమా కూడా అదే వారాంతంలో బరిలో నిలిచింది. ఇంతకుముందు విష్ణు-అనుష్క కలిసి ‘అస్త్రం’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు