నెల్లూరు కరోనా మందు.. రచ్చ రచ్చ

నెల్లూరు జిల్లాలోని కృష్ణంపట్నం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇక్కడ ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు.. కరోనాకు ఇస్తున్న మందు గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ముందు దీని గురించి అందరూ తక్కువ చేసి మాట్లాడారు. జనాల మూఢత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారని.. శాస్త్రీయత లేని మందు ఇచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానాలు వినిపించాయి.

ఈ మందు కోసం జనాలు క్యూలు కట్టిన ఫొటోలు, వీడియోలు చూపించి ఇదేం వెర్రితనం అంటూ వేళాకోళం చేశారు. కానీ ఇప్పుడు ఈ మందు నిజంగా చాలా బాగా పని చేస్తోందని దాన్ని తీసుకున్న వాళ్లు చెబుతుండటం.. ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న వాళ్లను అంబులెన్సుల్లో ఇక్కడికి తీసుకొచ్చి మందు వేయించి తీసుకెళ్తుండటం.. ఆ మందు వేసుకున్న కాసేపటికే కరోనా రోగులు కోలుకుని ఉత్సాహంగా మాట్లాడుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


ఒక మాజీ హెడ్ మాస్టర్‌ స్వయంగా కృష్ణంపట్నం ఆయుర్వేద మందు గురించి మీడియాకు ఒక బైట్ ఇచ్చారు. తాను కరోనాతో ఆసుపత్రిలో వారం నుంచి పోరాడుతున్నానని.. ఇక తాను బతుకుతాననే ఆశ పోయిందని.. విషమ స్థితిలో ఇక్కడికి వచ్చానని.. ఇంకొన్ని నిమిషాలు తనకు ఆక్సిజన్ పెట్టకుంటే తన ప్రాణాలు పోయేవని.. అలాంటి స్థితిలో ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు వేసుకుంటే 15 నిమిషాల్లో కోలుకున్నానని ఆయన మీడియాకు వెల్లడించారు. ఇలా ఈ మందు గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ మందును కంటిద్వారా వేస్తుండటం గమనార్హం.


ఐతే కరోనా మందును కంట్లో వేయడమేంటి.. ఇంత తక్కువ వ్యవధిలో ఉపశమనం రావడం ఏంటి అని అలోపతి వైద్యులు ప్రశ్నిస్తున్నారు. జనాల మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారని వాళ్లు ఆనందయ్య తీరును దుయ్యబడుతున్నారు. ఐతే ఈ మందును ఆనందయ్య ఉచితంగా ఇస్తుండటం విశేషం.

ఈ మందు కోసం నెల్లూరు జిల్లా వాళ్లే కాక ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తండటంతో రెండు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జాం అయ్యే పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులుగా జనం పెద్ద ఎత్తున గుమికూడి పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఈ మందు గురించి పరిశీలన జరిపిన వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రెండు రోజులు మందు పంపిణీ ఆపగా.. తిరిగి మళ్లీ పంపిణీ చేస్తున్నారు.