జ‌గ‌న్ మ‌ళ్లీ గెలిచి ఉంటే.. 17 వేల కోట్లు వేసేసేవారా?

వైసీపీ ప్రభుత్వ 2019 – 24 మధ్య కాలంలో విద్యుత్ ను అడ్డు పెట్టుకుని ప్ర‌జ‌ల ర‌క్తం పీల్చింద‌ని ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. తాజాగా ఆయ‌న విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ హ‌యాంలో విద్యుత్ చార్జీల పెంపు, ఏయే రూపంలో ఎలాంటి భారం మోపారు? ఎంత మేర‌కు నిధులు రాబ‌ట్టారు? అనే కీల‌క విష‌యాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు. గత 5 ఏళ్లలో… 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను బాదేశార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. త‌మ హ‌యాంలో 2014-19 మ‌ధ్య విద్యుత్ చార్జీల‌ను ఒక్క‌సారి కూడా పెంచ‌లేద‌ని చెప్పారు.

జ‌గ‌న్ పెంచిన విధానం ఇదీ..

టారిఫ్ పెంపు పేరుతో రూ.16,699 కోట్లు రాబ‌ట్టారు. ట్రూఅప్ / ఫ్యూయల్ సర్ ఛార్జ్ పేర.. 5,886 కోట్లు, మ‌రోసారి ట్రూఅప్ చార్జీలు అంటూ… 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 5,604 కోట్లు, ఇలా మొత్తం.. రూ.32,166 కోట్లు ప్రజల నుంచి విద్యుత్ చార్జీల రూపంలో రాబ‌ట్టిన‌ట్టు గ‌ణాంకాల‌తో స‌హా చంద్ర‌బాబు వివ‌రించారు. 2019 వరకూ యూనిట్‌ రూ.3.87పైగా ఉన్న సగటు విద్యుత్ చార్జీలను… రూ.5.83 పెంచార‌ని చంద్ర‌బాబు చెప్పారు. అంటే 45 శాతం అధికంగా పెంచేశారని, దీంతో ప్ర‌జ‌ల‌కు విద్యుత్ స్విచ్ వేయాలంటేనే షాక్ కొట్టింద‌ని చంద్ర‌బాబు చెప్పారు.

78 నుంచి 98 శాతం మంది పేద వినియోగదారులపై చార్జీల భారం మోపార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ప్ర‌స్తుత‌ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి.. ట్రూఅప్/ ఫ్యూయల్ సర్ ఛార్జ్ పేరిట రూ.17,137 కోట్ల భారం మోపేందుకు అన్నీ సిద్ధం చేసిన‌ట్టు వివ‌రించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే… ఈ 17,137 కోట్లు కూడా ప్రజల నుండి బాదేసేవారని చంద్ర‌బాబు త‌న శ్వేత ప‌త్రంలో వివ‌రించారు. కానీ, ప్ర‌జ‌లు విజ్ఞ‌త‌తో ఆలోచించి కూట‌మిని గెలిపించార‌ని తెలిపారు. తాము ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు విద్యుత్ చార్జీల‌ను పెంచ‌బోమ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌ను ఎలా త‌గ్గించాల‌నే విష‌యంపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.