ఇకపై జగన్ కేసుల రోజువారీ విచారణ

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ గత ఐదేళ్లుగా నత్తనడకన సాగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని 2024 ఎన్నికలకు ముందు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి హరి రామ జోగయ్య వేసిన పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే జగన్ కేసుల్లో రోజువారీ విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ పై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల రోజువారీ విచారణ చేపట్టి తేల్చేలాగా హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య పిల్ వేశారు.

సీబీఐ, ఈడీ కేసులు లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో నిందితుడైన జగన్ వరుస పిటిషన్లు వేసి విచారణను సాగనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా సాగడం లేదని, ఇతర రాష్ట్రాలకు ఈ కేసులను బదిలీ చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సీబీఐని విచారణ జరిపి కారణం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే, వరుసగా వివిధ రకాల పిటిషన్లు నిందితులు వేయడంతోనే విచారణ ఆలస్యమైందని కోర్టుకు సీబీఐ తెలిపింది.

క్విడ్ ప్రోకో ఆరోపణలతో మొత్తం 20 ఛార్జ్ షీట్లను జగన్ పై సిఐడి,ఈడి దాఖలు చేశాయి. ఈ కేసులపై సీబీఐ కోర్టులో 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ చార్జిషీట్ల నుంచి తప్పించాలని జగన్, విజయసాయిరెడ్డి ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జ్ పిటిషన్ లపై తీర్పు వెల్లడి కాలేదు. తీర్పు చెప్పాల్సిన రోజు జడ్జి బదిలీ కావడంతో ఆ కేసు వాదనలను తాజా సీబీఐ జడ్జి మళ్ళీ వింటున్నారు.