పదేళ్లుగా చేస్తున్న పోరాటం, గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి వైఫల్యం తాలూకు గాయం. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో చేయిస్తున్న అవమానం. క్యాడర్ లో సరైన స్ఫూర్తి కొరవడుతుందన్న అనుమానం.
ఇవన్నీ తట్టుకుంటూ జనసేనను ఒక్కొక్క ఇటుకలా పేర్చుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూసిన అద్భుత క్షణం వచ్చేసింది. తమ నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ రాజ్యాంగబద్దంగా మంత్రి పదవిని స్వీకరించిన ఘట్టాన్ని చూసి జనసేన కార్యకర్తలతో పాటు ప్రతి ఫ్యాన్ పులకరించిపోవడం వర్ణనకు దొరకనిది
పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ఏర్పాటు జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో చెప్పడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అందరిని ఒకేతాటిపైకి నడిపించడంలో చూపించిన చొరవ వల్లే ఇరవై ఒక్క సీట్లకే పరిమితం కావాల్సి వచ్చినా వంద శాతం స్ట్రయిక్ రేట్ సాధ్యమయ్యిందనే వాస్తవం ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన ఎన్డిఏ మీటింగ్ కి సైతం ఆహ్వానం అందుకునే స్థాయిలో జనసేనని బలపరిచిన పవన్ కళ్యాణ్ ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఇస్తున్న ప్రాధాన్యం మరింత బలం చేకూరుస్తుంది.
అసెంబ్లీ గేటు తాకనివ్వమని గతంలో కొందరు పవన్ ని ఉద్దేశించి చేసిన శపధాలు, ఏ మాత్రం నైతికత కాకపోయినా పెళ్లిళ్ల గురించి సాక్ష్యాత్తు మాజీ సీఎం ఎగతాళి చేసిన తీరు, పదే పదే వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసిన విధానం అన్నీ ఇప్పుడు దూదిపింజెల్లా ఎగిరిపోయాయి.
ఇదంతా కాసేపు పక్కనపెడితే ప్రమాణ స్వీకారం అయ్యాక పవన్ అందరు అతిథులను పలకరించి అన్నయ్య చిరంజీవి కాళ్లకు మళ్ళీ నమస్కారం చేయడం అభిమానులను కదిలించింది. ఇప్పటిదాకా హీరో, పవర్ స్టార్ గా ఉన్న పవన్ ఇకపై ప్రజా ప్రతినిధి, మంత్రిగా అసలైన సవాళ్ల ప్రయాణం చేయబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates