మొన్న నాలుగో పెళ్లాం.. ఇప్పుడు పరదాల మహరాణి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హోదాను మరిచిపోయి.. సందర్భం చూసుకోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రతిసారీ వ్యక్తిగత విమర్శలే చేస్తుంటారు. పదేళ్లుగా ఆయనది ఒకటే పాట.. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు పవన్ అని. పవన్‌కు అయింది మూడు పెళ్లిళ్లే అయినా.. ఇంకొకటి కలిపి నాలుగు పెళ్లిళ్లు అంటూ కామెంట్ చేసేస్తుంటారాయన. స్కూల్ పిల్లలతో జరిగిన సమావేశంలోనూ పవన్ పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడడం జగన్‌కే చెల్లింది.

ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ తగ్గట్లేదు. దీంతో విసిగి వేసారిపోయిన పవన్.. ఆ మధ్య తెలుగుదేశంతో పొత్తు తర్వాత ఆ పార్టీతో కలిసి నిర్వహించిన తొలి ఉమ్మడి సభలో జగన్‌కు వేసిన పంచ్ చర్చనీయాంశం అయింది. తనకు అయింది మూడు పెళ్లిళ్లు అయితే.. నాలుగో పెళ్లాం గురించి జగన్ మాట్లాడతాడని.. నా నాలుగో పెళ్లాం నువ్వేనా రా అంటూ పవన్ చేసిన కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని అందిపుచ్చుకుని జనసైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. జగన్‌ని నాలుగో పెళ్లాం.. వదినమ్మ అంటూ.. ఒక రేంజిలో ట్రోల్ చేశారు. టిట్ ఫర్ టాట్ అంటూ జగన్‌కు ఆయన భాషలోనే పవన్ భలే సమాధానం ఇచ్చాడంటూ ఆయనపై ప్రశంసలు కురిశాయి. కానీ ఆ తర్వాత కూడా జగన్‌ మారలేదు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ ప్రస్తావన వచ్చినపుడల్లా పెళ్లిళ్ల వ్యవహారమే మాట్లాడుతున్నారు. దీంతో పవన్ మరోసారి జగన్‌కు పంచ్ ఇచ్చాడు.

ఇంతకుముందు జగన్‌ను నాలుగో పెళ్లాం అన్న పవన్.. ఈసారి ‘పరదాల మహరాణి’ అంటూ కొత్త బిరుదు ఇచ్చాడు. పరదాల మహరాణిని కాకినాడ ఆదిత్య కాలేజీ విద్యార్థులు పాపం ఇబ్బంది పెట్టారంటూ జగన్‌కు వ్యతిరేకంగా అక్కడ జరిగిన నినాదాలు చేసిన విషయాన్ని పవన్ ప్రస్తావించాడు. ఐతే రాష్ట్రాన్నేలే పరదాల మహరాణి కక్ష పెట్టేసుకుంటుందని.. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించడం గమనార్హం. ఈ కామెంట్స్‌లో ‘పరదాల మహరాణి’ అనే మాటను తీసుకుని జనసైనికులు మరోసారి జగన్‌ను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.