వైసీపీలో చేతులు దులిపేసుకున్న వైవీ!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఉత్త‌రాంధ్ర జిల్లాల వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త‌.. వైవీసుబ్బారెడ్డి వివాదాల‌కు నిల‌యంగా మారారనే టాక్ వినిపిస్తోంది. ఈయ‌న పార్టీ ని ఏమేర‌కు డెవ‌ల‌ప్ చేశారో తెలియ‌దు కానీ, పార్టీని మాత్రం నిలువెత్తు వివాదాల‌లో క‌ప్పెట్టార‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. వ‌రుస విమ‌ర్శ‌లతో ఆయ‌న వైసీపీని ఇరుకున పెడుతున్నారు. ఏపీకి మ‌రో రెండేళ్లు హైద‌రాబాద్ నే రాజ‌ధానిగా కోరుకుంటున్నామ‌ని.. కేంద్రానికి ఈ మేర‌కు నివేదిక కూడా సీఎం జ‌గ‌న్ పంపిస్తున్నార‌ని చెప్పారు.

ఇది పెద్ద రాజ‌కీయ దుమారం రేపి.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. మూడు రాజ‌ధానులు క‌ట్టే ప‌రిస్థితి, ఓపిక‌, వ్యూహం లేక‌నే ఇలా హైద‌రాబాద్‌ను మ‌రోసారి రాజ‌ధానిగా కోరుకుంటున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోశాయి. ఈ తీవ్రత పెరిగింద‌ని గ్రహించిన పార్టీ అధిష్టానం చ‌క్క‌దిదద్దుకునే చ‌ర్య‌లు చేప‌ట్టి.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డిని రంగంలోకి దింపింది. ఆయ‌న త‌మ‌కు ఆ ఉద్దేశం లేద‌ని.. ఏపీలోనే విశాఖ‌ను రాజ‌ధాని చేయాల‌న్న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డ్డామ‌ని తేల్చి చెప్పారు.

ఇక‌, రెండో వివాదం.. పార్టీలో ఇటీవ‌ల నియ‌మించిన స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు అస‌లు అభ్య‌ర్థులే కార‌ని.. ఎన్నిక‌లు వారం ముందు.. కొత్త జాబితా ఇస్తామ‌ని వారే అభ్య‌ర్థుల‌ను వైవీ బాంబు పేల్చారు. దీంతో అప్పటి వ‌ర‌కు వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాయ‌కులు నిరుత్సాహంలో కూరుకుపోయారు. అప్ప‌టి వ‌ర‌కు ఉత్సాహంగా ప‌నిచేసిన నాయ‌కులు.. ఇక‌, చతికిల ప‌డ్డారు. చేతిలో ఉన్న రూపాయిలు ఖ‌ర్చు చేసేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఇది పెద్ద మైన‌స్‌గా మారిపోయింది.

ఇక‌, తాజాగా రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. ఏకంగా.. శ్రీకాకుళంలో సుబ్బారెడ్డి ఆస్తులు కాజేసేందుకు వ‌చ్చార‌ని తంతాన‌ని వార్నింగ్ ఇచ్చాన‌ని.. లేక‌పోతే.. ఇక్కడి భూముల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయేద‌ని వ్యాఖ్యానించారు. ఇది మరింత‌గా డ్యామేజీ చేసింది. దీనిలో నిజం ఎంతో తెలియ‌క పోయినా.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ఆయుధాలు అందించేసిన‌ట్టు అయింది. వైసీపీకి ఓట్లేస్తే.. ఇక్క‌డి భూములు కొల్ల గొట్టేస్తార‌నే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇలాంటి ప్ర‌చారం పార్టీకి మ‌రింత ఇబ్బందిగా మారింది.