జనాలను నగదుతో టార్గెట్ చేస్తోన్న జగన్

ఏపీలో ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తోన్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం జగన్ కృత నిశ్చయంతో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే ఆగస్టు 12న ఏపీలో 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75,000 నగదు అందించే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న మహిళల ఖాతాల్లో నేరుగా నగదు జమ అయింది. ఈ క్రమంలోనే బుడగ జంగం, వాల్మీకి, ఈనేటికోండ్, బెంటో ఒరియా కులాలకు ఈ పథకం అందించాలని సీఎం జగన్ తాజాగా అధికారులను ఆదేశించారు. ఆయా కులాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, కుల ధ్రువీకరణ పత్రం లేకపోయినా జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఆయా కులాలవారు కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నాలుగు కులాలకు చెందిన వారికి సెల్ఫ్ సర్టిఫికేషన్ మీద పథకాన్ని అమలుచేయనున్నారు.

సీఎం జగన్ అమలు చేస్తోన్న పథకాల్లో మెజారిటీ పథకాలు నగదు బదిలీ వంటివే. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడేలా జగన్ పథకాలు ఉన్నాయి. తన ప్రభుత్వం ద్వారా వేరే రూపాల్లో లబ్ధి పొందడం కంటే నగదు రూపంలో లబ్ధి పొందితేనే ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అవుతారన్నది జగన్ ఆలోచన కావచ్చు.

అందుకే, దాదాపుగా కుటుంబంలో అర్హులైన వారుంటే….ఏపీ ప్రభుత్వం అందించే ఏదో ఒక పథకం ద్వారా వారికి నగదు బదిలీ అవుతోంది. అంటే, ఏపీలో 60 శాతానికి పైగా ప్రజలు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నమాట. అందుకే, జగన్ చేసే ప్రతి ప్రకటన…ప్రతి పథకం డబ్బుతో ముడిపడి ఉంటోందన్న విమర్శలు వస్తున్నాయి.

జగన్ మెజారిటీ ప్రకటనలు ఈ తరహాలోనే ఉంటున్నాయని, వేరే విషయాల ఊసే ఎత్తడం లేదని, ఈ ఉచిత పథకాలు, నగదు జమల వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

ఉచిత పథకాలు, నగదు జమల వల్ల చాలామంది ప్రజలు సోమరిపోతులై పోతున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా, తనకు క్రెడిట్ రావడం కోసం క్రెడిట్(అప్పు) తీసుకుంటున్నారని, డబ్బుతో అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని జగన్ అనుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ పథకాల కోసం ఏపీని అప్పులు ఊబిలోకి జగన్ నెడుతున్నారని, రేపు రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఈ భారం పడుతుందని కామెంట్లు చేస్తున్నారు.