కడపలో టీడీపీకి ఇంత పోటీనా

టికెట్ కోసం ఈ నియోజకవర్గంలో నలుగురు నేతలు చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి ఫైనల్ గా ఎవరు సక్సెస్ అవుతారన్నది సస్పెన్సుగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో ప్రొద్దుటూరు కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి సీనియర్ తమ్ముళ్ళ మధ్య పోటీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు మాజీ ఎంఎల్ఏ నంద్యాల వరదరాజులరెడ్డి, మరోవైపు మాజీ ఎంఎల్ఏ మల్లెల లింగారెడ్డి, ఇంకోవైపు సీఎం సురేష్ నాయుడు, వీళ్ళకి అదనంగా ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

విడివిడిగా చూస్తే వీళ్ళు నలుగురు కీలకమైన నేతలే. అయితే అందరిలోకి లేటుగా పార్టీలో జాయిన్ అయ్యింది ప్రవీణ్ కుమార్ అని చెప్పాలి. అలాగే వరదరాజులరెడ్డి ఒకటికి రెండు పార్టీలు మారి ఇపుడు మళ్ళీ టీడీపీలో ఉన్నారు. ఇక సీఎం సురేష్ నాయుడు తన సోదరుడు సీఎం రమేష్ పలుకుబడి మీదే ఆధారపడ్డారు. జిల్లా అధ్యక్షుడు కూడా అయిన లింగారెడ్డి మాత్రమే మొదటినుండి టీడీపీలో ఉన్నారు. అయితే పై నలుగురిలో ఏ ఇద్దరి మధ్యా ఏమాత్రం సఖ్యత లేదు. ఒకరంటే మరొకరికి ఏమాత్రం పడదు.

ప్రవీణ్ కు పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప ఎంపీ అభ్యర్ధి శ్రీనివాసులరెడ్డి మద్దతుంది. అందుకనే ప్రవీణ్ రాబోయే ఎన్నికల్లో తానే అభ్యర్ధిగా ప్రచారం చేసేసుకుంటున్నారు. టీడీపీ అభ్యర్ధిగా ప్రవీణ్ వాల్ పోస్టర్లు కూడా నియోజకవర్గంలో అంటించేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో పార్టీలో మిగిలిన ముగ్గురు బాగా గోలచేస్తున్నారు. అధికారికంగా చంద్రబాబు ఇంతవరకు ఎవరినీ అభ్యర్ధిగా ప్రకటించలేదని చెబుతు లింగారెడ్డి, వరదరాజులు మీడియా సమావేశాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

ఏదేమైనా టికెట్ కోసం నియోజకవర్గంలో నేతల మధ్య ఇంత గొడవ జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటంలేదో అర్ధంకావటంలేదు. నలుగురిని పిలిపించి గట్టిగా మాట్లాడి సమస్యను సర్దుబాటు చేయాల్సింది పోయి మౌనంగా చూస్తున్నారు. దాంతో నేతల మధ్య వివాదాలు మరింతగా పెరిగిపోతున్నాయి. అంతిమంగా ఈ వివాదాలు అభ్యర్ధి గెలుపుమీద నెగిటివ్ ప్రభావం చూపిస్తుందని క్యాడర్ ఆందోళన పడుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో, ఎవరు పోటీచేస్తారో చూడాలి.