ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. గత నెలలో పార్టీ బాధ్యతలు చేపట్టిన ఆమె.. ఒకవైపు పార్టీని పరుగులు పెట్టించడంతోపాటు, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధుల అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రధానికి లేఖ రాశారు. అనంతరం.. ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా నిరసన కూడా వ్యక్తం చేశారు.
ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖలు సంధించారు. ఈ లేఖల్లో రాష్ట్ర సమస్యలను షర్మిల ప్రస్తావించారు. వీటిపై ఇప్పుడే స్పందించాలని.. ఎన్నికల వేళ కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని ఆమె సూచించారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా ఆమె పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా చేసిన ద్రోహం అసెంబ్లీ వేదికగా చర్చించి హామీలన్నింటినీ వెంటనే అమలు చేసేందుకు తీర్మానాన్ని వెంటనే ఆమోదించాలని సీఎం జగన్ సూచించారు.
అంతేకాదు.. గడిచిన పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి ఐదేళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరమని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అభివృద్ధి, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 లో ప్రత్యేక హోదా సహా పోలవరానికి జాతీయ హోదా వంటి ముఖ్యమైన హామీలు పొందుపరిచారని తెలిపారు.
కానీ విభజన అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఆ హామీలను పూర్తిగా పక్కన పెట్టేసిందని, బీజేపీతో అప్రకటిత పొత్తులో ఉన్న వైసీపీ. ఐదున్నర కోట్ల ప్రజల ఆశలను, ఆశయాలను తీర్చే హామీలను సాధించుకోవడానికి పోరాటం చేయలేదన్నారు. రాష్ట్రానికి జరిగిన చారిత్రిక అన్యాయాన్ని సరిచేస్తామనే వాగ్దానంతో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందని, కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా స్పందించాలని షర్మిల సూచించారు.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి రాసిన లేఖలోనూ ఇవే అంశాలు పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోయారని అన్నారు. విభజన హామీలపై టీడీపీ నిలదీసే ప్రయత్నం చేయడం లేదు. హోదా కావాలని ఒకసారి, హోదా అవసరం లేదని మరోసారి మాట మారుస్తూ ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లిన మీరు ఇప్పటికైనా కళ్లు తెరవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు.
ఇవీ షర్మిల డిమాండ్లు..
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా
- పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
- విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్
- రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనకబడిన ప్రాంతాలకు నిధులు
- కడపలో ఉక్కు ఫ్యాక్టరీ
- విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్
- కొత్త రాజధాని నగర నిర్మాణం
- విశాక ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చూడాలి