టీవీ9 పేరెత్తితే చాలు జనసైనికులకు అస్సలు గిట్టదు. జనసేనాని పవన్ కళ్యాణ్ చేసే ఏ మంచి పనినీ ఆ ఛానెల్ హైలైట్ చేయదని.. కానీ ఆయనకు వ్యతిరేకంగా చిన్న విషయం కనిపించినా బూతద్దంలో చూపించి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుందని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ టాప్ ఛానెల్ పని చేస్తుందని జనసైనికులు ఆరోపిస్తుంటారు.
తాజా పరిణామాల నేపథ్యంలో టీవీ9 పట్ల వారి వ్యతిరేకత, ఆగ్రహం ఇంకా పెరిగిపోయాయి. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వాళ్లందరికీ పేరు పేరునా ఆత్మీయంగా బదులిచ్చాడు పవన్.
ఐతే దీన్ని తప్పుబడుతూ నటి మాధవీలత ఫేస్ బుక్‌లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో పవన్ ఇలా అందరికీ జవాబివ్వడాన్ని తప్పుబట్టింది. టాలీవుడ్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పవన్‌ను డిమాండ్ చేసింది. ఐతే ఔట్ డేట్ అయిపోయిన హీరోయిన్ ఏదో పోస్టు పెడితే ఆమెను లైన్లోకి తీసుకుని పవన్‌కు వ్యతిరేకంగా టీవీ 9 ఒక చర్చా కార్యక్రమం పెట్టడం జనసైనికులకు మంట తెప్పించింది.
దీని మీద పవన్ కళ్యాణ్ సైతం స్పందించాడు. ఆయన తరఫున టీవీ9 తీరును తప్పుబడుతూ.. ఆ ఛానెల్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజైంది. దీంతో టీవీ9 కూడా అప్రమత్తం అయితే తమకు దురుద్దేశాలేమీ లేవని వివరణ ఇచ్చుకుంది.
కానీ జనసైనికులకు మాత్రం కోపం చల్లారలేదు. నిన్నట్నుంచి #shamelesstv9 అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ ఛానెల్ తీరును ఎండగడుతున్నారు. ఇప్పటిదాకా ఆ హ్యాష్ ట్యాగ్ మీద నాలుగున్నర లక్షల దాకా ట్వీట్లు పడటం.. ఇండియా, వరల్డ్ లెవెల్లో అది ట్రెండ్ అవడం విశేషం. ఐతే ఇదేమీ పట్టనట్లు ఆ ఛానెల్ తన పని తాను చేసుకుపోతోంది.