తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకున్న టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మరో రెండు మాసాల్లో రాష్ట్రంలో రామన్న రాజ్యం ఏర్పడుతుందని చెప్పారు. రామన్న రాజ్యం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. నాటి ఎన్టీఆర్.. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని.. దీంతో రామన్న రాజ్యం ఏర్పడిందని అన్నారు.
అయితే.. వైసీపీ పాలనలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారని.. కేవలం వైసీపీ నాయకులు మా త్రమే బలపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ 1983లో పార్టీ స్థాపించినప్పుడు అన్ని వర్గాల వారినీ కలుపుకొని పోయారని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ‘తెలుగుదేశం పిలుస్తోంది. రా… కదలిరా!’ అని పిలుపునిచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే తాము రా..కదలిరా! సభలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
“ఒకే ఒక జీవితం… రెండు తిరుగులేని చరిత్రలు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది… తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి’’ అన్నారు.
తెలుగు ప్రజలంతా ఐక్యంగా ముందుకు నడవాల్సిన అవసరం ఏర్పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించా రు. వైసీపీ పాలనను అంతమొందించేందుకు.. అందరూ కలిసి ముందుకు రావాలని.. రా..కదలిరా! సభను విజయవంతం చేయాలని(శుక్రవారం గుడివాడలో ఏర్పాటు చేశారు) చంద్రబాబు కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతా(ఎక్స్)లో చంద్రబాబు సుదీర్ఘ లేఖ రాసుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates