టీడీపీలోకి వైసీపీ ఎంపీ.. టికెట్ ఖ‌రారే?

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు.. జంపింగుల ప‌ర్వం ఊపందుకుంది. వైసీపీలో టికెట్లు ద‌క్క‌ని నాయ‌కులు జంపింగుల‌కు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు..జ‌న‌సేన‌లో చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు. ఇలానే మ‌రికొంద‌రు కూడా త‌మ దారులు తాము వెతుక్కుంటున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ అయిన‌ట్టు ఇటు పార్టీలోనూ.. అటు ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలోనూ చ‌ర్చ సాగుతోం ది.

2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో ఉన్న మాగుంట‌.. అప్ప‌టికి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే, ఆయ‌న ఒంగోలు పార్ల‌మెంటు స్థానాన్ని కోరుకున్నారు. కానీ, రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు తిర‌స్క‌రించారు. దీంతో ఎమ్మెల్సీగా ఉంటూనే వైసీపీతీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంట‌నే ఒంగోలు టికెట్ కూడా కైవ‌సం చేసుకుని పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత వైసీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌ర‌చుగా టీడీపీ నాయ‌కుల‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే వాద‌న వినిపించింది. ఒకానొక సంద‌ర్భంలో త‌న కుమారుడి పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని టీడీపీ ఎంపీల‌కు ఢిల్లీలో పార్టీ కూడా ఇచ్చారు.

ఈ ప‌రిణామాలో లేక మ‌రోకార‌ణ‌మో.. ఏదేమైనా వైసీపీ ఇప్పుడు మాగుంట‌కు టికెట్ ఇచ్చే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టింది. ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు మాగుంట రాఘ‌వ‌రెడ్డిని నెల్లూరు లేదా ఒంగోలు పార్ల‌మెంటు స్థానాల్లో ఒక దాని నుంచి పోటీకి నిల‌బెట్టి.. తాను ఎమ్మెల్సీ కావాల‌నేది మాగుంట ఆలోచ‌న‌. ఈ రెండింటికీ కూడా వైసీపీ విముఖత వ్య‌క్తం చేసిన‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల నేరుగా తాడేప‌ల్లికి వ‌చ్చి తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. కానీ, ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్లున్న‌ట్టు పార్టీ నుంచి వ‌ర్త‌మానం అందింది.

అయితే.. ఈ తాత్సారాన్ని ఎలా అర్థం చేసుకున్నారో ఏమో.. మాగుంట టీడీపీ వైపు చూస్తున్నార‌నే చ‌ర్చ తెర‌మీద‌కి వ‌చ్చింది. ఇప్ప‌టికే చంద్ర‌బాబుతోనూ ఆయ‌న ట‌చ్‌లోకి వెళ్లార‌ని తెలుస్తోంది. నెల్లూరు లేదా ఒంగోలు పార్ల‌మెంటు స్థానాల్లో ఒక‌టి కేటాయించాల‌ని ఆయ‌న పార్టీ అధినేత చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేసిన‌ట్టు స‌మాచారం. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి అభ్య‌ర్థులు లేక‌పోవ‌డం మాగుంట‌కు క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు. అయితే.. దీనిపై ఇంకా చంద్ర‌బాబు నుంచి స్స‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని, అది వ‌స్తే..ఆయ‌న పార్టీ మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.