వచ్చే మూడు మాసాల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో 10 స్థానాలపై బీజేపీ కన్నేసిన విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా హైదరాబాద్ కు వచ్చి మరీ.. ఇక్కడి బీజేపీ పరిస్థితులపై చర్చించారు. ఈ క్రమంలో ఆయన కొన్ని స్థానాలపై కొందరు అభ్యర్థులకు సంబంధించి ప్రొఫైల్స్ ను స్వీకరించినట్టు తెలిసింది. ఇదిలావుంటే.. అమిత్‌షాతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అదే రోజు రహస్యంగా భేటీ అయ్యారన్న సమాచారం వచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వీరి భేటీలో ఏం మాట్లాడారన్న విషయం పక్కన పెడితే.. తాజాగా మందకృష్ణకు సంబంధించిన సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయనను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ టికెట్‌ను మందకృష్ణకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మందకృష్ణకు టికెట్ ఇవ్వడం ద్వారా వర్గీకరణకు డిమాండ్ చేస్తున్న మాదిగ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకొనేందుకు మరింత బలమైన వ్యూహాన్ని అనుసరించినట్టు అవుతుందని కమల నాథులు భావిస్తున్నారు.
ఇక, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పైగా అప్పట్లోనే ప్రధాని నరేంద్రమోడీ మనసును కూడా ఆయన దోచుకున్నారు. ఇద్దరూ ఒకే వేదికపై పక్క పక్కన కూర్చున్నారు. ఆలింగనం కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని బీజేపీ ప్రకటించిన తర్వాత మందకృష్ణ కాషాయం పార్టీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ 8 స్థానాల్లో అనూహ్య విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోనూ మరింత దూకుడు పెంచాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో వరంగల్ లోక్ సభ స్థానం నుంచి మందకృష్ణ మాదిగ ను బరిలో దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. మంద కృష్ణకు టికెట్ కేటాయిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇదే జరిగితే.. మందకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం.. అది కూడా బీజేపీ తరఫున పోటీకి దిగడం తొలిసారి కానుంది. మరోవైపు.. ఆయన కూడా పోటీకి రెడీగానే ఉన్నారు. పార్లమెంటులో మరింత బలంగా తన గళం వినిపించేందుకు అవకాశం లభిస్తుందని బావిస్తున్నారు. ఇదిలావుంటే, వరంగల్ ఎంపీ స్థానాన్ని మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్, బీజేపీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి కూడా ఆశిస్తున్నారు.