వరుస విజయాలు.. వీటికి సమానంగా ప్రజల సమస్యలపై దూకుడు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై పోరు. వెరసి ఒకప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోని నియోజకవర్గం ఇప్పుడు కీలక నియోజకవర్గంగా మారిపోయింది. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎస్సీలకు రిజర్వ్ చేసిన కొండపి. ఒకప్పుడు ఈనియోజక వర్గం పెద్దగా వార్తల్లో ఉండేది కాదు. కానీ, 2014, 2019లో ప్రభుత్వ మాజీ డాక్టర్ డోలాబాల వీరాంజనేయ స్వామి విజయం తర్వాత.. నియోజకవర్గం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది.
కొన్ని దశాబ్దాలుగా తిష్టవేసిన సమస్యలకు ఆయన పరిష్కారం చూపించారు. టీడీపీ అధికారంలో ఉండగా .. అనేక రోడ్లు వేయించారు. కుళాయిలకు నోచుకోని ఇళ్లకు కుళాయి సౌకర్యం కల్పించారు. యువతకు ఉపాధి చూపించారు. విదేశీ విద్యా దీవెన పథకం కింద ఎస్సీల్లో పేదలైన విద్యార్థులకు ఉన్నత విద్యను అందుకునేలా చేశారు. వెరసి.. డోలా అంటే.. నియోజకవర్గానికి ఒక బ్రాండ్ అనేలా తన సత్తా చూపించా రు. ఈ క్రమంలో 2019లో పార్టీ కనుక విజయం దక్కించుకుని ఉంటే ఆయన మంత్రి అయ్యేవారనే టాక్ ఉంది.
అయితే.. అనూహ్యంగా 2019లో టీడీపీ అధికారం కోల్పోయింది. అయినా.. ఇక్కడి ప్రజలు డోలాకే పట్టం కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పవనాలు వీచినా.. ఇక్కడ మాత్రం డోలాను ప్రజలు గెలిపించారు. అదే స్ఫూర్తితో ఆయన కూడాప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ప్రజలకు చేరువయ్యారు. బలమైన నాయకుడిగా ఎదిగారు. అసెంబ్లీలో వైసీపీ సర్కారును నిలదీశారు. అనేక ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. దీంతో వైసీపీ వ్యూహం మార్చేసింది. ఎక్కడో ఎర్రగొండపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను తెచ్చి.. ఇక్కడ ఇంచార్జ్‌ను చేసేసింది.
డోలాను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. అయినప్పటికీ.. ప్రజాభిమానం.. డోలా ముద్ర నియోజకవర్గంపై స్పష్టంగా కనిపిస్తున్నాయని టీడీపీనాయకులు చెబుతున్నారు. ఆయన గెలుపు తథ్యమేనని అంచనాలు వేస్తున్నాయి. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి, ప్రజలకు తలలో నాలుకగా ఉన్న తీరు ఆయనను మరోసారి విజయం వైపు నడిపిస్తాయని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates