రేవంత్ ప్రమాణ స్వీకార సభలో తళుక్కుమన్న ఆమె ఎవరు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే వేళలో.. అతిరథ మహారధులు ఉన్న వేదిక మీద.. రాహుల్ గాంధీ.. ప్రియాంక వాద్రా వెనుక కూర్చున్న ఒక మహిళ మీదకు కెమేరా కళ్లు చాలాసార్లు ఫోకస్ అయ్యాయి. తెలుగుప్రాంతంలో ఎప్పుడూ కనిపించని ఆమె ఎవరు? చూసినంతనే ఆకర్షణీయంగా ఉన్న ఆ వీవీఐపీ ఎవరు? అన్న మాట రాజకీయ వర్గాల్లో ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికినప్పుడు ఆసక్తికర సమాధానం బయటకు వచ్చింది.

ఇంతకూ ఆమె ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు.. ప్రణతి షిండే. తెలంగాణ రాష్ట్రానికి పొరుగున ఉన్న మహారాష్ట్ర. ఇంతకు ఆమెకు తెలుగు రాజకీయాలకు లింకేమిటి? అన్న ప్రశ్న తలెత్తొచ్చు. అయితే.. మరిన్ని వివరాలు సేకరించినప్పుడు.. ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కావటంలో అర్థం కనిపిస్తుంది. రేవంత్ ప్రమాణ స్వీకార సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన ప్రణతి ఎవరో కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించటంతోపాటు.. అంతకు ముందు కేంద్ర మంత్రిగా.. కాంగ్రెస్ సీనియర్ నేతగా సుపరిచితుడైన సుశీల్ కుమార్ షిండే గారాలపట్టి.

ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు కాగా.. వారిలో ప్రణితి ఒకరు. చిన్న కుమార్తె అయిన ఆమె తండ్రి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. రాజకీయ వారసురాలిగా తెర మీదకు వచ్చారు. 28 ఏళ్ల చిరుప్రాయంలో ఎన్నికల బరిలోకి దిగిన ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ మహిళా నేతల్లో అత్యంత యాక్టివ్ గా ఆమెకు పేరుంది. ప్రస్తుతం మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న ఆమె.. రేవంత్ ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలంగాణకు చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర ప్రముఖుల్ని కూడా ఆహ్వానించారు.

ఈ క్రమంలో ఆమె ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. పార్టీలో ఆమెకున్న స్థాయికి తగ్గట్లే.. రాహుల్.. ప్రియాంక వెనుకనే ఆమెకు చోటుదక్కింది. దీంతో.. ఆమె కెమేరా కళ్లకు చిక్కారు. ఇక్కడ ఆమె గురించి మరో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సుశీల్ కుమార్ షిండే షోలాపూర్ ఎంపీగా పోటీ చేశారు. కానీ.. బీజేపీ అభ్యర్థి శ్రీసిద్ధేశ్వర్ మహారాజ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి పరాజయానికి బదులు తీర్చుకోవాలన్న కసితో ప్రణతి ఉందని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే షోలా పూర్ మీద కేసీఆర్ సారు కూడా ఫోకస్ పెట్టిన వేళ.. అదే రాష్ట్రంలో తమ పార్టీ కొలువు తీరిన నేపథ్యంలో.. రేవంత్ ప్రమాణ మహోత్సవానికి హాజరైనట్లుగా చెబుతున్నారు.