30 నియోజకవర్గాలే డిసైడింగ్ ఫ్యాక్టరా ?

తెలంగాణా ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్దీ ఓట్ల పోలరైజేషన్ పై చర్చలు పెరిగిపోతున్నాయి. మామూలుగా గత ఎన్నికల వరకు తమ ఊరికి, కాలనీకి ఏమిచేస్తారని అభ్యర్ధులను జనాలు అడిగేవారు లేకపోతే నిలదీసేవారు. కానీ ఈసారి ఎన్నికల ట్రెండ్ మారింది. తమ సామాజికవర్గానికి ఏమిచేస్తారు ? తమ మతానికి ఏమి చేయబోతున్నారని బహిరంగంగానే డిమాండ్లు చేస్తున్నారు, హామీలు తీసుకుంటున్నారు. నిజానికి ఎన్నికల నిబంధనల ప్రకారం మతం, కులం గురించి ఎన్నికల్లో ప్రస్తావించకూడదు.

కానీ ఈ నిబంధనను ఏ పార్టీ కూడా పట్టించుకోవటంలేదు. ఇందులో భాగంగానే ఇపుడు ప్రముఖంగా కనబడుతున్నది ఏమిటంటే ముస్లిం మైనారిటీల పాత్ర. మొత్తం 119 ఎన్నికల్లో 37 నియోజకవర్గాల్లో మైనారిటీలదే కీలకపాత్ర. ఇందులో ఓల్డ్ సిటిలోని ఏడు నియోజకవర్గాలు ఎంఐఎం ఖాతాలోనే పడుతున్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గాలను పక్కనపెట్టేద్దాం. ఇక 112 నియోజకవర్గాల్లో మిగిలింది 30 నియోజకవర్గాలు. ఈ 30 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్ధి గెలవాలన్నా ముస్లింల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్.

ముస్లిం ఓట్లు అత్యధికంగా జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో తలా లక్ష ఉంటాయి. అందుకనే ఇక్కడ ఏరికోరి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో అజహరుద్దీన్, నిజమాబాద్ అర్బన్ లో షబ్బీర్ ఆలీకి టికెట్లిచ్చింది. ఖైరతబాద్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, కరీంనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో సుమారు 60 వేల నుండి లక్ష ఓట్లున్నాయి. ముషీరాబాద్, మహబూబ్ నగర్, బోధన్, జహీరాబాద్, గోషామహల్లో 50 వేల ఓట్లున్నాయి.

అంబర్ పేట, సికింద్రాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డిలో 40 వేల ఓట్లుంటాయి. ఇదే విధంగా 8 నియోజకవర్గాల్లో 30-40 వేల ఓట్లున్నాయి. అలాగే 20-30 వేల ఓట్లున్న నియోజకవర్గాలు రెండున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్లో 12 వేల ఓట్లున్నాయి. పోయిన ఎన్నికల్లో ఈ 30 నియోజకవర్గాల్లో 26 సీట్లను బీఆర్ఎస్ గెలుచుకున్నది. మూడు స్ధానాలను కాంగ్రెస్ గెలుచుకుంటే ఒక్క స్ధానం గోషామహల్లో బీజేపీ గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో తాము పోటీచేయని సీట్లలో ముస్లిం ఓట్లను బీఆర్ఎస్ కు వేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెబుతున్నారు. మరి ముస్లిం మైనారిటీలు ఏమిచేస్తారో చూడాలి.