తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించే నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లా లోని గద్వాల్ అసెంబ్లీ స్థానం. దీనికి కారణం.. పొలిటికల్ ఫైర్ బ్రాండ్, గద్వాల్ జేజెమ్మగా పేరొందిన డీకే అరుణ కీలకంగా మారడమే. ఇప్పటి వరకు ఆమె ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పైనే పోటీ చేస్తుండగా.. తొలిసారి బీజేపీ తరఫున బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతున్నారు.
వాస్తవానికి 2004లో పొలిటికల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన డీకే అరుణ అప్పటి నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ తరఫునే పోటీ చేశారు. మంత్రి పీఠాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగానే బరిలోకి దిగుతున్నారు. తాను పార్టీ మారిన నేపథ్యంలో సంప్రదాయంగా వస్తున్న తన ఓటు బ్యాంకు.. ఇప్పుడు జేజెమ్మను కలవర పెడుతోంది.
ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు ఇప్పటికీ డీకే అరుణ కాంగ్రెస్‌లోనే ఉన్నారని అనుకుంటున్నారు. దీంతో ఆమెకు ఓటు వేయాలనుకునేవారు కాంగ్రెస్‌కే వేయాలని నిర్ణయించినట్టు డీకే అనుచరులు చెప్పుకొచ్చా రు. దీంతో ఖంగుతిన్న డీకే.. వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగి.. పల్లె బాట పట్టారు. తాను కాంగ్రెస్‌లో లేనని.. అతి పెద్ద బీజేపీలో ఉన్నానని ఆమె ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలావుంటే.. సంప్రదాయంగా ఇక్కడ రెండు ఓటు బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, రెండు బీఆర్ ఎస్. 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ నేత కృష్ణ మోహన్‌రెడ్డి విజయం దక్కించుకున్నారు. ఇటీవల ఆయన గెలుపును హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కథ వేరే ఉంది. అయితే.. ఇప్పుడు కొత్తగా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకోవడం, కాంగ్రెస్ వర్గాన్ని తనవైపు తిప్పుకోవడం పైనే జేజెమ్మ గెలుపు ఆధారపడి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.